CBI Raids: తుపాకీ లైసెన్సుల స్కాం.. ఓ ఐఏఎస్‌ ఇంట్లో సహా 40చోట్ల సోదాలు

తాజా వార్తలు

Updated : 24/07/2021 17:13 IST

CBI Raids: తుపాకీ లైసెన్సుల స్కాం.. ఓ ఐఏఎస్‌ ఇంట్లో సహా 40చోట్ల సోదాలు

శ్రీనగర్‌: తుపాకీ లైసెన్సుల మంజూరులో గోల్‌మాల్‌ వ్యవహారంపై విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. దేశ రాజధాని దిల్లీ సహా జమ్మూకశ్మీర్‌లోని పలు చోట్ల ముమ్మర సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి శ్రీనగర్‌లోని సీనియర్‌ ఐఏఎస్‌ షాహిద్‌ ఇక్బాల్‌ చౌధురి ఇంటితో పాటు మొత్తం 40 చోట్ల సోదాలు కొనసాగిస్తోంది. శ్రీనగర్‌, ఉదంపూర్‌, రాజౌరి,అనంత్‌నాగ్, బారాముల్లా ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన షాహిద్‌ ఇక్బాల్‌ చౌధురి ప్రస్తుతం గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన యూత్‌ మిషన్‌ సీఈవోగానూ ఉన్నారు. గతంలో కతువా, రియాసి, రాజౌరి, ఉదంపూర్‌ జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారికి నకిలీ పేర్లతో అక్రమంగా  వేల సంఖ్యలో తుపాకీ లైసెన్సులను అక్రమంగా జారీచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

ఈ వ్యవహారంలో ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్లను సీబీఐ ప్రశ్నించింది. 2012 వరకు దాదాపు రెండు లక్షలకు పైగా స్థానికేతరులకు అక్రమంగా తుపాకీ లైసెన్సులను జారీ చేసినట్టు నిర్ధారణ అయింది. దేశంలోనే అతిపెద్ద గన్‌ లైసెన్స్‌ రాకెట్‌ ఇదే కావడం గమనార్హం. ఈ కుంభకోణంలోనే గతేడాది ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ సహా ఇద్దరు అధికారులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కుప్వారా జిల్లాకు డిప్యూటీ కమిషనర్లుగా ఉన్న సమయంలో రాజీవ్‌ రంజన్‌, ఇత్రాత్‌ హుస్సేన్‌ రఫికీలు అక్రమంగా గన్‌ లైసెన్సులు జారీ చేసిన ఆరోపణలపై అరెస్టయ్యారు. 

తుపాకీ లైసెన్సుల మంజూరులో ఈ భారీ కుంభకోణాన్ని 2017లో రాజస్థాన్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ గుర్తించింది. రంజన్‌ సోదరుడితో పాటు గన్‌ డీలర్లకు మధ్యవర్తులుగా పనిచేస్తున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేసిన సందర్భంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, అప్పటి ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ ముసుగులో నిందితులను రక్షించే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ కుంభకోణంలో  కశ్మీర్‌ ప్రభుత్వ అధికారుల పాత్ర ఉన్నట్టు గుర్తించిన మాజీ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా ఈ కేసును సీబీఐకి అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని