Corona: మహమ్మారి వేళ..మాడ్యులర్ ఆస్పత్రులు
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 14:07 IST

Corona: మహమ్మారి వేళ..మాడ్యులర్ ఆస్పత్రులు

దిల్లీ: కరోనా వేళ దేశంలో వైద్య సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఆ లోపాలను సరిదిద్దేందుకు కేంద్రం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేపనిలో పడినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా రానున్న రెండుమూడు నెలల్లో 50 వినూత్న మాడ్యులర్ ఆస్పత్రులను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఎక్కడికక్కడ విడదీసి, వేరేప్రాంతానికి తరలించి, అక్కడ తిరిగి అమర్చుకునే సౌలభ్యం ఉండటం. ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది.

ఇప్పటికే ఉన్న ఆస్పత్రులకు అనుబంధంగా ఈ మాడ్యులర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.3 కోట్ల అంచనాతో 100 పడకలతో నిర్మించ తలపెట్టిన ఒక్కో ఆస్పత్రిలో ఐసీయూ సౌకర్యం కూడా ఉండనుంది. మూడు వారాల్లో వీటిని నిర్మించవచ్చు. అలాగే ఆరు నుంచి ఏడు వారాల్లో అవి పూర్తి స్థాయి కార్యకలాపాలకు సిద్ధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ 100 పడకల మాడ్యులర్ ఆస్పత్రులను మొదటి దశలో బిలాస్‌పూర్, అమరావతి, పుణె, జాల్నా, మొహాలి వంటి నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. రాయ్‌పూర్‌లో 20 పడకల ఆస్పత్రిని నిర్మించనుండగా.. బెంగళూరులో 20, 50, 100 పడకల ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. 25 సంవత్సరాల పాటు ఇవి సేవలందించగలవు.

దేశంలో రెండోదశలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించింది. ఆ సమయంలో కరోనా బాధితులకు వైద్యసౌకర్యాలు అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో కనిపించాయి. వైద్య సేవలు మెరుగుపర్చుకోవాల్సిన ఆవశ్యకతను ఆ పరిస్థితులు కళ్లకు కట్టాయి. భవిష్యత్తులో మరో దఫా వైరస్ విజృంభణపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని