China: చైనాలో 214 కోట్ల డోసుల పంపిణీ..!

తాజా వార్తలు

Published : 13/09/2021 17:40 IST

China: చైనాలో 214 కోట్ల డోసుల పంపిణీ..!

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు చైనాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా దూసుకెళ్తోంది. గత శనివారం నాటికి అక్కడ 214కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు ఆ దేశ జాతీయ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. టీకా తయారీ నుంచి పంపిణీ వరకు గోప్యత పాటిస్తోన్న చైనా.. ఈ ఏడాది జూన్‌ 19న తొలిసారిగా వ్యాక్సినేషన్‌లో 100కోట్ల డోసుల మార్క్‌ను దాటింది. ఆ తర్వాత కేవలం 10 వారాల్లోనే మరో బిలియన్‌ డోసులను పంపిణీ చేసింది. ఆగస్టు చివరలో 200కోట్ల మార్క్‌ను దాటేసింది. 

140 కోట్ల జనాభా కలిగిన చైనాలో ఇప్పటివరకు దాదాపు 90కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే అక్కడ దాదాపు 64శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. అమెరికా, జపాన్‌, జర్మనీ లాంటి దేశాలతో పోలిస్తే టీకా పంపిణీలో చైనా ముందుంది. ఈ ఏడాది చివరి నాటికి 100శాతం జనాభాకు రెండు డోసుల టీకా ఇవ్వాలని బీజింగ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలో పడేసిన కరోనా మహమ్మారి తొలుత బయటపడింది చైనాలోనే. దీంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు డ్రాగన్ టీకా ప్రయోగాలు చేపట్టింది. అయితే వాటి తయారీ, ఇతర విషయాలను ప్రపంచానికి వెల్లడించకుండా అత్యంత గోప్యత పాటించింది. అక్కడ ప్రస్తుతం సినోవాక్‌, సినోఫార్మ్‌ టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు టీకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతులు కూడా ఇచ్చింది. వీటితో కరోనా వ్యాప్తిని దాదాపు నిర్మూలించింది.

అయితే ఇటీవల కాలంలో అక్కడ డెల్టా వేరియంట్‌ కేసులు వెలుగుచూశాయి. టీకాలు వేసుకున్నవారు కూడా ఈ వేరియంట్‌ బారిన పడటంతో చైనా మళ్లీ ఆంక్షల బాట పట్టింది. కొత్త కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని