Afghan developments: న్యూదిల్లీకి అమెరికా, రష్యా కీలక అధికారులు..!

తాజా వార్తలు

Updated : 08/09/2021 14:57 IST

Afghan developments: న్యూదిల్లీకి అమెరికా, రష్యా కీలక అధికారులు..!

బ్రిక్స్‌,ఎస్‌సీవో,క్వాడ్‌ సమావేశాలకు ముందు కీలక భేటీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై అమెరికా, రష్యాలతో భారత్‌ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. తాజాగా అమెరికా, రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్‌, భద్రతావిభాగ అధికారులు దిల్లీకి వచ్చారు. అమెరికా బృందానికి సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్‌ విలియమ్‌ బర్న్స్‌ నేతృత్వం వహించారు. ఈ బృందం పాకిస్థాన్‌, భారత్‌ను సందర్శించింది.  మంగళవారం దిల్లీలో వీరు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోబాల్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో అఫ్గాన్‌ నుంచి భారతీయుల తరలింపు, తాలిబన్‌ కొత్త ప్రభుత్వం వంటి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. భారత విదేశాంగ శాఖ, అమెరికా దౌత్య కార్యాలయం దీనిపై స్పందించలేదు. గతంలో భారత్‌-అమెరికా అణు ఒప్పందానికి జరిగిన చర్చల్లో విలియమ్‌ పాల్గొన్నారు. ఆయన గతంలో దౌత్యవేత్తగా పనిచేశారు.

బుధవారం పర్యటనలో రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జర్నల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌ దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోబాల్‌, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌తో భేటీ కానున్నారు. ఆయన నిన్న రాత్రే దిల్లీకి చేరుకొన్నారు. ఆగస్టు 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ సంభాషణ తర్వాత ఈ భేటీని నిర్ణయించారు. ప్రస్తుతం భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోబాల్‌తో భేటీ మొదలైంది.  

నికోలాయ్‌ పాట్రూషెవ్‌ 2008 నుంచి రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటరీగా ఉన్నారు. అంతేకాదు గతంలో రష్యన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అయిన ఎఫ్‌ఎస్‌బీకి ఆయనే అధిపతిగా పనిచేశారు. ఆయన్ను పుతిన్‌ రైట్‌ హ్యాండ్‌గా అభివర్ణిస్తారు. ఈ భేటీ.. అఫ్గాన్‌ పరిణామాలపై భారత్‌-రష్యా అభిప్రాయలను పంచుకోవడానికి మంచి వేదిక అవుతుంది.

ఈ సందర్భంగా రష్యాలోని భారత రాయబారి డి.బి.వెంకటేశ్‌ వర్మ అఫ్గాన్‌ పరిణామాలపై స్పందించారు. ‘‘తాలిబన్లతో దోహాలో జరిగిన చర్చల్లో, ట్రైకా ప్లస్‌ బృందం జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వలేదు. భారత్‌ వీటిల్లో భాగం కాలేదు. ఒక విషయం అర్థమైంది. భారత్‌-రష్యాలు కలిసి పనిచేయడమే అన్నింటికంటే ఉత్తమమైన పని. అదే మేము నేర్చుకొన్న అతిపెద్ద పాఠం’’ అని పేర్కొన్నారు.

కీలక భేటీలకు ముందు..

ఈ నెలలో ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి కీలక భేటీలకు హాజరుకానున్నారు. వాటికి ముందు భారత్‌లో అమెరికా, రష్యా పర్యటించడం గమనార్హం. ఈ నెల 16న షాంఘై కార్పొరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీవో) మీటింగ్‌ వర్చువల్‌ విధానంలో జరగనుంది. అనంతరం సెప్టెంబర్‌ 24వ తేదీన అమెరికాలో జరగనున్న క్వాడ్‌ మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఎస్‌సీవోలో రష్యా అధిపత్యం ఉండగా.. క్వాడ్‌లో అమెరికా ఆధిపత్యం ఉంది. ఈ రెండు భేటీల్లో అఫ్గాన్‌ అంశమే ప్రధానంగా చర్చకు రానుంది.

గురవారం భారత్‌ వర్చువల్‌గా బ్రిక్స్‌ సమావేశం నిర్వహించనుంది. దీనిలో భారత ప్రధాని మోదీతోపాటు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ భేటీలో ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డొబాల్‌ భద్రతా పరమైన అంశాలపై ప్రత్యేక ప్రజంటేషన్‌ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని