
తాజా వార్తలు
‘కొవాగ్జిన్’ క్లినికల్ సామర్థ్యం 81%
వెల్లడించిన భారత్ బయోటెక్
హైదరాబాద్: కరోనా నిరోధక టీకా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. వైరస్ నివారించడంలో తాము అభివృద్ధి చేసిన టీకా మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 81శాతంగా ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. సుమారు 25,800 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించినట్టు భారత్ బయోటెక్ స్పష్టంచేసింది. ఈ దశలో ఫలితాలు గతంతో పోలిస్తే మెరుగైనట్టు తెలిపింది. దేశంలో అత్యవసర వినియోగం కింద ఇప్పటికే కొవాగ్జిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మరింత సమాచారంతో పాటు కొవాగ్జిన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు టీకాపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని సంస్థ స్పష్టం చేసింది.
కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఈ రోజు కీలకమైందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. దేశంలోనే అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్ చేపట్టామన్నారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న కరోనా ఉత్పరివర్తనాలకు వ్యతిరేకంగా కొవాగ్జిన్ గణనీయమైన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయన వెల్లడించారు. యూకే రకం కరోనా వైరస్‌పైనా కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్‌ను పంపిణీ చేస్తున్నారు. కొవిషీల్డ్ సామర్థ్యం 70శాతం కాగా.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ క్లినికల్ సామర్థ్యం 81శాతం కావడం గమనార్హం.