కరోనా డేంజర్‌బెల్:50% యాక్టివ్‌ కేసులు అక్కడే

తాజా వార్తలు

Updated : 03/04/2021 16:46 IST

కరోనా డేంజర్‌బెల్:50% యాక్టివ్‌ కేసులు అక్కడే

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ మళ్లీ డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. దీంతో క్రియాశీల కేసుల గ్రాఫ్‌ పైపైకి పోతోంది. శుక్రవారం ఒక్కరోజే 89వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. వీటిలో 81.42% కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే వెలుగుచూడటం గమనార్హం. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 47,913 కొత్త కేసులు రాగా.. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక (4991), ఛత్తీస్‌గఢ్(4174)‌, దిల్లీ(3594), తమిళనాడు(3290), ఉత్తర్‌ప్రదేశ్‌(2953), పంజాబ్(2873)‌, మధ్యప్రదేశ్‌(2777) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వణుకుతున్న మహారాష్ట్ర!

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ప్రకారం.. దేశంలో ఇప్పటిదాకా 6,58,909 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీటిలో 3.91లక్షల కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఇక్కడ ఫిబ్రవరి నాటికి 42,830గా ఉన్న క్రియాశీల కేసులు ఏప్రిల్‌ 3నాటికి తొమ్మిది రెట్లు పెరిగాయి. అలాగే, కర్ణాటకలో ఆరు రెట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 8 రెట్లు, పంజాబ్‌లో 12 రెట్లు, దిల్లీలో 10 రెట్లు ఎగబాకాయి. మరోవైపు, క్రియాశీల కేసుల్లో 77శాతం కేవలం మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, పంజాబ్‌లలోనే ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 59.36 శాతంగా ఉన్నాయి.

యాభై శాతం యాక్టివ్‌ కేసులు ఇక్కడే..

దేశంలోని 50శాతం యాక్టివ్‌ కేసులు కేవలం 10 జిల్లాల్లోనే ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో 10.75% పుణెలో ఉండగా.. ఆ తర్వాత  ముంబయి 8.75%, నాగ్‌పుర్‌ 7.71%, ఠానె 6.83%, నాసిక్‌ 5.66%, బెంగళూరు అర్బన్‌ 3.73%, ఔరంగాబాద్‌ 2%, దిల్లీ 1.82%, అహ్మద్‌నగర్‌ 1.74%, నాందేడ్‌ 1.67% చొప్పున ఉన్నాయి.

13 రాష్ట్రాలు మరణాల్లేవ్‌..

భారత్‌లో గడిచిన 24గంటల వ్యవధిలోనే 714 మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇవి కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమవడం ఉపశమనం కలిగించే అంశం. కొత్తగా నమోదైన మరణాల్లో 86శాతం మరణాలు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 481 మరణాలు నమోదు కాగా.. పంజాబ్‌ 57, ఛత్తీస్‌గఢ్‌ 43, యూపీ, మధ్యప్రదేశ్‌లలో 16 చొప్పున మరణాలు వెలుగుచూశాయి. 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క మరణమూ నమోదు కాలేదు. ఈ జాబితాలో ఒడిశా, అసోం, లద్దాఖ్‌, దామన్‌డయ్యా, దాద్రానగర్‌, నాగాలాండ్‌, మేఘాలయా, మణిపూర్‌, త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్‌, మిజోరం, అండమాన్‌ నికోబార్‌దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి.

దేశంలో ఇప్పటిదాకా 24,69,59,192 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,23,92,260మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 1,15,69,241మంది కోలుకోగా.. 1,64,110మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 6,58,909 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 93.36శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.32శాతంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 10,46,605 శాంపిల్స్‌ పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని