మహానగరాల్లో మహమ్మారి విశ్వరూపం!

తాజా వార్తలు

Published : 28/04/2021 22:03 IST

మహానగరాల్లో మహమ్మారి విశ్వరూపం!

ముంబయి, దిల్లీ దారిలో బెంగళూరు

బెంగళూరు: కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ధాటికి మహానగరాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో తన ప్రతాపం చూపిన కరోనా మహమ్మారి.. తాజాగా బెంగళూరులోనూ విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా అక్కడ నిత్యం పదిహేనువేల కేసులు నమోదవుతుండగా తాజాగా నేడు ఒక్క బెంగళూరు నగరంలోని 22వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇలా ముంబయి, దిల్లీ, బెంగళూరు నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది.

బెంగళూరులోనే 2లక్షల యాక్టివ్‌ కేసులు..

కరోనా వైరస్‌ విజృంభణతో కర్ణాటక వణకిపోతోంది. గడిచిన 24గంటల్లో అక్కడ రికార్డు స్థాయిలో 39,047 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క బెంగళూరు నగరంలోనే నేడు 22,596 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మంగళవారం రోజు అక్కడ 31వేల కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14లక్షలకు చేరింది. వీరిలో దాదాపు 80శాతం మంది కోలుకోగా మరో 3లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. కేవలం ఒక్క బెంగళూరు నగరంలోనే రెండు లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 15వేల మంది కొవిడ్‌ మహమ్మారికి బలయ్యారు. వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో ఆంక్షలు పొడగింపు..?

కరోనా మహమ్మారి మహారాష్ట్రను వెంటాడుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 44లక్షల మందిలో వైరస్‌ బయటపడగా వీరిలో 66వేల మంది మృత్యువాతపడ్డారు. నిత్యం అక్కడ 66వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ముంబయిలో కరోనా తీవ్రత కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. బుధవారం నాడు 4966 కేసులు, 78 మరణాలు రికార్డు అయినట్లు బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. కేవలం ముంబయి నగరంలోనే ఇప్పటివరకు 12,990మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు. అయితే, రాష్ట్రంలో అమలుచేస్తున్న కఠిన ఆంక్షల కారణంగా ముంబయిలో కొవిడ్‌ పెరుగుదల రేటు గణనీయంగా తగ్గింది. గడిచిన వారంలో(ఏప్రిల్‌ 21 నుంచి 27వరకు) కరోనా కేసుల పెరుగుదల రేటు 0.93గా నమోదైనట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ముంబయిలో పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలోని పుణె, నాగ్‌పూర్‌ వంటి ప్రధాన నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలుచేస్తున్న ఆంక్షలను మరో 15రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించినట్లు మంత్రి రాజేష్‌ తోప్‌ వెల్లడించారు.

దిల్లీలో కొనసాగుతున్న ఉద్ధృతి

దేశ రాజధాని దిల్లీలో కరోనా విలయం అంతకంతకూ పెరుగుతోంది. నిత్యం అక్కడ దాదాపు 25వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 35శాతం దాటడం ఆందోళన కలిగిస్తోంది. వీటికితోడు కొవిడ్‌ మరణాల సంఖ్య అత్యధికంగా ఉండడం కలవరపెట్టే విషయం. నిత్యం అక్కడ 300లకు పైగా కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అక్కడి శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అంత్యక్రియల కోసం మృతదేహాలను కొన్ని గంటలపాటు అక్కడే నిలిపివుంచడం తీవ్రంగా కలచివేస్తోంది. దిల్లీలో ఇప్పటివరకు 15వేల మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీటితో పాటు కొవిడ్‌ రోగులకు మెడికల్‌ ఆక్సిజన్‌ అందించడంలో అక్కడి ఆసుపత్రులు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి.

కేరళలోనూ రికార్డుస్థాయి కేసులు

కరోనా వైరస్‌ ధాటికి కేరళ కోలుకోవడం లేదు. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అనంతరం కేరళనే నిలిచింది. తాజాగా అక్కడ కొత్తగా 35వేల కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు 25.34శాతానికి పెరగడం ఆందోళన కలిగించే విషయం. అయితే మరణాల సంఖ్య కాస్త తక్కువగానే ఉండడం ఊరట కలిగించే అంశం. బుధవారం ఒక్కరోజే అక్కడ 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో లక్షకుపైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. వీటతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత అధికంగానే ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు కొత్తగా 29,824 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని