Mental Health: బాధేస్తోందా.. ఏడుపొస్తోందా.. అయితే రండి

తాజా వార్తలు

Published : 18/10/2021 22:45 IST

Mental Health: బాధేస్తోందా.. ఏడుపొస్తోందా.. అయితే రండి

స్పెయిన్‌లో మానసిక సమస్యల బాధితులకు ప్రత్యేక గదులు

మాడ్రిడ్‌: కుంగుబాటు.. ఆందోళన.. ఇతర మానసిక సమస్యలు.. ఒకానొక దశలో దాదాపు అందరూ ఎదుర్కొనేవే! కానీ.. ఒకప్పుడు ఈ అంశాలపై బహిరంగంగా మాట్లాడటం అరుదు! చెప్పినా.. చాలామంది పెద్దగా పట్టించుకునేవారు కాదు! కొంతమంది వాటిని అసలు సమస్యగానే పరిగణించేవారు కాదు. కానీ.. కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇదే తరుణంలో ప్రభుత్వాలూ తమ పౌరుల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ‘స్పెయిన్‌’ చేరింది.

‘ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్య’

స్పెయిన్‌లో 2019లో 3,671 మంది ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా మరణాలకు ఇదే రెండో అతిపెద్ద కారణం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. కౌమారంలో ఉన్న 10 మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మొత్తం జనాభాలో 5.8 శాతం మంది ఆందోళన(యాంగ్జైటీ) బాధితులే. దీంతో స్పానిష్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఇటీవల పౌరుల కోసం ‘మానసిక ఆరోగ్య సంరక్షణ’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందుకు రూ.873.27 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 24 గంటలు పని చేసే సూసైడ్ హెల్ప్‌లైన్ తదితర సేవలు అందుబాటులో ఉంచారు. ‘మానసిక అనారోగ్యం అనేది ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్య. దీనిపై మాట్లాడం నిషిద్ధం కాదు. తప్పనిసరిగా మాట్లాడాలి. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ఈ సందర్భంగా పౌరులకు పిలుపునిచ్చారు.

వినూత్నంగా క్రయింగ్‌ రూం..

మానసిక ఆందోళన, డిప్రెషన్‌ బాధితుల కోసం అక్కడి ప్రభుత్వం వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. మానసిక సంఘర్షణ, కష్టాలు ఎదురైనప్పుడు, లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడవటం తప్పు కాదు అనే భావన స్ఫూరించేలా.. సెంట్రల్ మాడ్రిడ్‌లో ‘క్రయింగ్‌ కార్నర్‌’ల పేరిట ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే.. అందులోకి వెళ్లి బాధ నుంచి ఉపశమనం కలిగేలా ఏడ్వొచ్చు. గదిలో ఫోన్‌లనూ అందుబాటులో ఉంచారు. ఆయా నిపుణులతోపాటు సైకాలజిస్టులతో మాట్లాడొచ్చు. ‘మానసిక ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం నిజంగా అద్భుతమైన ఆలోచన. అనేక ఇతర దేశాల్లో మాదిరిగా స్పెయిన్‌లోనూ ఏడవటాన్ని ఒక తప్పుగా భావిస్తారు’ అని స్థానికంగా ఓ విద్యార్థి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని