Delhi Rains: దిల్లీలో కుండపోత.. నీట మునిగిన అండర్‌పాస్‌ రోడ్లు

తాజా వార్తలు

Published : 21/08/2021 13:34 IST

Delhi Rains: దిల్లీలో కుండపోత.. నీట మునిగిన అండర్‌పాస్‌ రోడ్లు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ప్రాంతంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు నెలలో దిల్లీలో ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం 13ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపారు. 

వర్షం కారణంగా దిల్లీ రైల్వే స్టేషన్‌లోకి వరద నీరు చేరింది. దీంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. మింటో బ్రిడ్జ్‌ సహా పలు అండర్‌పాస్‌ రోడ్లలో భారీగా నీరు చేరడంతో ఆ మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. నోయిడా, ఆజాద్‌పూర్‌, ప్రగతి మైదాన్‌, లాజ్‌పత్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షానికి రాజ్‌ఘాట్‌లోనూ నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన ప్రాంతాల వీడియోను భాజపా నేత నవీన్‌ కుమార్‌ జిందాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసి ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దిల్లీ అంతటా శనివారం ఆరెంజ్‌ అలర్ట్‌, ఆదివారం ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని