Delhi Rains: దిల్లీని ముంచెత్తిన వాన.. ఎయిర్‌పోర్టులోకి వరదనీరు

తాజా వార్తలు

Updated : 11/09/2021 13:29 IST

Delhi Rains: దిల్లీని ముంచెత్తిన వాన.. ఎయిర్‌పోర్టులోకి వరదనీరు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ వాసులను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున మరోసారి కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వరదనీరు చేరింది. రన్‌వే, టర్మినల్‌ 3 ప్రాంతాల్లో నీరు నిలిచింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలను దారిమళ్లించారు. ఎయిర్‌పోర్టులో నీటిని తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దిల్లీలో శుక్రవారం ఉదయం నుంచే జల్లులు మొదలయ్యాయి. ఈ తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు చోట్ల రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. అండర్‌పాస్‌ వంతెనల వద్ద నీరు నిలవడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న 12 గంటల్లో దిల్లీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధానికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

గత కొద్ది రోజులుగా దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురుస్తోంది. వర్షాకాలంలో దిల్లీలో ఈ స్థాయిలో కుండపోత కురవడం 46ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని