Pegasus: పెగాసస్‌ను ఉపయోగించామా లేదా అన్నది అఫడివిట్‌లో చెప్పలేం

తాజా వార్తలు

Updated : 13/09/2021 14:19 IST

Pegasus: పెగాసస్‌ను ఉపయోగించామా లేదా అన్నది అఫడివిట్‌లో చెప్పలేం

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిసన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేయట్లేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. 

‘‘పెగాసస్ అంశం అత్యంత ముఖ్యమైనదే. అయితే ఓ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఉపయోగించిందా లేదా అన్నది బహిరంగంగా చర్చించే అంశం కాదు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ సమాచారాన్ని అఫిడవిట్‌లో పేర్కొనలేదు. అందువల్ల ఈ వ్యవహారంలో ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్‌ సరిపోతుంది. సవివరమైన అఫిడవిట్‌ను సమర్పించాల్సిన అవసరం లేదు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలను బహిరంగపర్చలేమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పెగాసస్‌ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ అన్ని ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటుంది. అన్నీ పరిశీలించి కోర్టుకు నివేదిస్తుంది’’ అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా కోర్టుకు తెలిపారు. 

కేంద్రం సమాధానంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము దేశ భద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి వెళ్లడం లేదని, డిఫెన్స్‌ వంటి విషయాలు అడగట్లేదని సీజేఐ అన్నారు. కేంద్రం పదేపదే అవే అంశాలను ప్రస్తావిస్తుందన్నారు. ‘‘పెగాసస్‌ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలు. ఇందులో గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలి. దీనిపై ఒక ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి అవకాశమిచ్చాం. కారణం ఏదైనా ప్రకటన చేయడానికి కేంద్రం ఇష్టపడట్లేదు’’ అని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లపై రెండు, మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ లోగా కొత్త అఫిడవిట్‌ దాఖలు చేసే విషయంపై కేంద్రం పునరాలోచన చేయొచ్చని చెబుతూ తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని