
తాజా వార్తలు
ప్రతిభావంతులకు మెండుగా అవకాశాలు: మోదీ
దిల్లీ: దేశంలో ప్రతిభ కలిగిన యువతకు చాలా రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విద్యారంగంలో బడ్జెట్ కేటాయింపుల అమలు అంశంపై బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. ‘కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యం తర్వాత విద్య, నైపుణ్యాలు, పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి రంగాలపైనే ఎక్కువగా దృష్టి సారించాము. అంతేకాకుండా విద్యను ఉపాధి మార్గాలతో అనుసంధానం చేయడానికి మేం చేస్తున్న ప్రయత్నాలను బడ్జెట్ మరింత విస్తృతం చేస్తోంది. ఆ ప్రయత్నాల ఫలితంగానే.. నేడు భారత్ సైంటిఫిక్ పబ్లికేషన్‌లో తొలి మూడు దేశాల్లో స్థానం సంపాదించింది’ అని మోదీ వెల్లడించారు.
విజ్ఞానం, పరిశోధనలపై పరిమితులు విధించడం అంటే దేశలో ప్రతిభకు అన్యాయం చేయడమే అని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతిభ కలిగిన యువతకు అంతరిక్షం, అటామిక్ ఎనర్జీ, డీఆర్డీవో, వ్యవసాయం సహా పలు రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యావిధానం స్థానిక భాషలకు ప్రోత్సాహం కల్పిస్తోందని చెప్పారు. కాబట్టి, ఇప్పుడు అన్ని భాషల్లో అత్యుత్తమ కంటెంట్‌ను రూపొందించాల్సిన బాధ్యత ఆయా భాషా నిపుణులపై ఉందని సూచించారు.