చైనా వెయ్యి ఇసుక రేణువుల వ్యూహం..!

తాజా వార్తలు

Updated : 12/04/2021 16:51 IST

చైనా వెయ్యి ఇసుక రేణువుల వ్యూహం..!

ఇదో తరహా గూఢచర్యం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా స్టైలే వేరు.. ఏది చేసినా ఓపిగ్గా.. విభిన్నంగా చేస్తుంది. గూఢచర్యం కూడా అంతే.. అందుబాటులో ఉన్న ప్రతి వనరును  వినియోగిస్తుంది. అందుకే అమెరికా సీఐఏ వలేనో.. ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ల తరహాలో చైనా గూఢచర్య సంస్థల పేర్లు బయట వినపడవు.. కానీ, చాపకింద నీరులాగా సమాచారం మాత్రం సరిహద్దులు దాటేస్తుంది. తాజాగా గ్రీకు పత్రిక పెంటాపోస్టాగ్మా చైనా గూఢచర్యంలోని ఓ భాగాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనా ‘వెయ్యి ఇసుక రేణువులు’ (థౌజండ్‌ గ్రెయిన్స్‌ ఆఫ్‌ శాండ్‌) విధానంలో సమాచార సేకరణ చేస్తుందని వెల్లడించింది. చైనా ఈ పద్దతి వాడుతుందని గతంలో కూడా అమెరికా ఎఫ్‌బీఐ మాజీ అధికారి పాల్‌మూర్‌ దీనిని గురించి విశ్లేషించారు. వేర్వేరు మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గరచేర్చి విశ్లేషించడమే చైనా ప్రత్యేకత. 

వార్తాసంస్థ ముసుగులో..

చైనా ఇంటెలిజెన్స్‌లో జిన్హూవా అనే న్యూస్‌ ఏజెన్సీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని గ్రీస్‌ పత్రిక వెల్లడించింది. ఈ వార్తా సంస్థకు ఎనిమిది వేర్వేరు భాషల్లో  దాదాపు 20 పత్రికలు.. డజను మ్యాగ్జైన్‌లు ఉన్నాయి.  వివిధ దేశాల్లో దాదాపు 107 బ్యూరోలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థకు విదేశాల్లోనే దాదాపు 10,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.  
ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ , నాయకులకు సంబంధించి సానుకూల ప్రచారం చేస్తుంది. దీంతోపాటు వారిపై వచ్చే వ్యతిరేక కథనాలను సాధ్యమైనంత వరకు ఆదిలోనే తుంచివేస్తుంది. 

కీలక విషయాలు చైనాకు..

జిన్హూవా న్యూస్‌ ఏజెన్సీ ప్రపంచంలోని కీలక పరిణామాలను కవర్‌ చేస్తుంది. అదే సమయంలో చైనాకు, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి అవసరం అనుకొన్న వార్తలపై నివేదికలు తయారు చేసి చైనా స్టేట్‌ సెక్యూరిటీ మినిస్ట్రీకి పంపిస్తుంది. ముఖ్యంగా సీసీపీ నాయకత్వానికి అవసరమైన వార్తలను సేకరించడంలో దీని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.  సాధారణంగా పత్రికలకు ఉండే స్వేచ్ఛను వాడుకొని ఈ సంస్థ విదేశాల్లోని కీలక సంస్థల్లోకి వెళుతుంది.. అక్కడి సమాచారం సేకరించి నివేదిక రూపంలో చైనాకు పంపిస్తుందని గ్రీస్‌ పత్రిక వెల్లడించింది. 

ఇతర మార్గాల్లో కూడా..

అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే చైనా విద్యార్థులను  నిఘా కార్యకలాపాలకు వాడుకొంటుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లోని చైనా విద్యార్థులపై నిఘా ఉంచడానికి అక్కడి కన్ఫ్యూషియాస్‌ ఇన్‌స్టిట్యూట్‌లను వాడుకొంటాయి. వీరిని నయానో భయానో దారిపెట్టి అవసవరమైన సమాచార సేకరణకు వాడుకొంటాయి. అందుకే గతేడాది డిసెంబర్‌లో ట్రంప్‌ కార్యవర్గం 1000 మంది చైనా విద్యార్థులను వెనక్కి పంపింది. ఇక ఆఫ్గనిస్థాన్‌లో గతేడాది గూఢచర్యానికి పాల్పుడుతున్న పలువురు వ్యక్తులను అక్కడి దళాలు అరెస్టు చేశాయి. చివరికి చైనా ఒత్తిడితో వారిని వెనక్కి పంపాయి. 

2010లో సీఐఏకు షాక్‌..

ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌గా పేరున్న సీఐఏకు 2010లో చైనా భారీ షాక్‌ ఇచ్చింది. చైనాలో పనిచేస్తున్న సీఐఏ ఏజెంట్ల వివరాలను ఒడిసిపట్టింది. డజన్‌మంది వరకు సీఐఏ ఏజెంట్లకు మరణశిక్ష విధించింది. డజన్లకొద్దీ ఏజెంట్లను జైళ్లలోకి నెట్టింది. కొందరు ఏజెంట్లను వారి సహచరులు చూస్తుండగానే చంపేసింది. ఫలితంగా అమెరికా ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ చైనాలో తుడిచిపెట్టుకుపోయింది. సీఐఏ అత్యున్నత  నాయకత్వంలో ఎవరినో చైనా కోవర్టుగా నియమించిందని అనుమానించినా.. ఆ వ్యక్తిని అమెరికా పట్టుకోలేకపోయింది. దీనితోపాటు సీఐఏ కీలక నెట్‌వర్క్‌ను చైనా హ్యాక్‌ చేసిందన్న మరో వాదనను కూడా తెరపైకి తెచ్చారు. వాస్తవానికి ఈ అంశం ఇప్పటికే తేలలేదు. అమెరికాతో జరుగుతున్న ఆర్థిక, సైనిక, దౌత్య, సాంకేతిక, విద్యా,మౌలిక వసతుల పోటీలో గెలిచేందుకు ఓపిగ్గా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో చైనా దగ్గరున్న తిరుగులేని ఆయుధం గూఢచర్యం. 

కంపెనీ బోర్డుల్లో కూడా..

చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు పలు దిగ్గజ సంస్థల్లో ఉన్నారు. ఈ సంస్థల జాబితాలో ఉత్పాదక రంగానికి చెందిన బోయింగ్‌, ఫోక్స్‌వేగన్‌, రోల్స్‌రాయిస్‌ వంటి సంస్థలు ఉండగా.. ఆర్థిక రంగానికి చెందిన ఏఎన్‌జెడ్‌, హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థలు ఉన్నాయి. దీంతోపాటు కరోనావైరస్‌ టీకా ఉత్పత్తి చేస్తున్న ఫైజర్‌, ఆస్ట్రాజెనెకాల్లో కూడా వీరు ఉన్నట్లు గతంలో బయటపడింది. షాంఘైలోని ఆస్ట్రేలియా, యూకే, అమెరికా దౌత్య కార్యాలయాల్లో కూడా వీరు ఉన్నట్లు కథనాలు బయటపెట్టాయి. చైనా గూఢచర్యంపై ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి మాట్లాడుతూ ‘‘ సీసీపీ సభ్యుడు ఒకరు ఆసీస్‌ సబ్‌మెరైన్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు అనుకుందాం. జలాంతర్గామి టెక్నికల్‌ డేటా అతనికి తెలుస్తుంది. అది కచ్చితంగా చైనా నౌకాదళానికి ఆధిక్యాన్ని ఇస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఛాన్‌ హాంగ్‌ అనే ఓ చైనా స్కాలర్‌ తరచూ ఆస్ట్రేలియాను సందర్శిస్తుంటే ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానించి అతని వీసాను రద్దు చేశాయి. ఆ వ్యక్తి చైనా కమ్యూనిస్టు పార్టీకి సన్నిహితుడని తేలింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని