Kerala: శని, ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌!

తాజా వార్తలు

Published : 21/07/2021 19:41 IST

Kerala: శని, ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌!

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శని, ఆదివారాల్లో (ఈ నెల 24,25 తేదీల్లో) పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో టెస్ట్‌లను పెంచాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. శుక్రవారం రోజు అదనంగా 3లక్షల పరీక్షలు చేయాలని సూచించింది. పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించింది. అన్ని జిల్లాల్లోనూ మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్లను గుర్తించాలని కలెక్టర్లను కోరింది. కరోనా కేసులను నియంత్రించడమే లక్ష్యంగా నిబంధనలను కఠినతరం చేయాలంది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో తక్షణమే రోజువారీ పరీక్షలను పెంచాలని సూచించింది. లాక్‌డౌన్‌ అమలు ఉన్న సమయంలో జూన్‌ 12, 13 తేదీల్లో జారీ చేసిన నిబంధనలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. 

బక్రీద్‌ నేపథ్యంలో మూడు రోజుల పాటు సడలింపులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. టెక్స్‌టైల్‌ దుకాణాలు, నగలు, చెప్పుల దుకాణాలను ఆదివారం నుంచి మూడు రోజుల పాటు తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతించడంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కూడా జులై 19న సీరియస్‌ అయింది. జీవించే హక్కుపై శ్రద్ధ తీసుకోవాలని, కరోనా కేసులు పెరిగితే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాకుండా భారతీయ వైద్య సంఘం కూడా ఈ వివాదాస్పద నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతూ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో నిన్న స్పందించిన సీఎం విజయన్‌.. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న కొవిడ్‌ ఆంక్షల్ని  మరోవారం పాటు పొడిగిస్తున్నట్టు స్పష్టంచేశారు. 

తాజాగా కేరళలో 1.45లక్షల పరీక్షలు చేయగా 17వేలకు పైగా కొత్త కేసులు, 105 మరణాలు నమోదు కావడం కలకలం రేపుతోంది. మలప్పురం, ఎర్నాకుళం, కొయ్‌కోడ్‌ జిల్లాల్లో 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం మరో 14,131 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 30.59లక్షలకు చేరింది. ప్రస్తుతం 1.29లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని