చైనా: మాపై అపనిందలు మోపొద్దు..!
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 17:05 IST

చైనా: మాపై అపనిందలు మోపొద్దు..!

జి-7 ప్రకటనను ఖండించిన చైనా

బీజింగ్‌: తమ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే కాకుండా వివిధ అంశాలపై తమ తీరును తప్పుపడుతూ జి-7 దేశాల కూటమి చేసిన ప్రకటనను డ్రాగన్‌ ఖండించింది. ఇలా చైనాపై నిందలు వేయడం ఆపాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఘర్షణ వాతావరణం సృష్టించకుండా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేసే చర్యలు చేపట్టాలని జి-7 కూటమికి హితవు పలికింది. డ్రాగన్‌ ఆధిపత్యాన్ని అడ్డుకుని ఓ దీటైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో జి-7 దేశాలు ఓ అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది.

షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో మానవ హక్కుల ఉల్లంఘన, హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తి, తైవాన్‌లో శాంతి సామరస్యాలపై చర్చించిన జి-7 దేశాలు, ఆయా దేశాల్లో మానవ హక్కులను గౌరవించాలని చైనాకు పిలుపునిచ్చాయి. దీనిపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని, తమ దేశ కీర్తిపై నిందలు వేయవద్దని విజ్ఞప్తి చేసింది. చైనా విషయంలో జి-7 కూటమి దేశాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని దుయ్యబట్టింది.

మేము మాదేశ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కచ్చితంగా కాపాడుకుంటామని.. అదే సమయంలో తమపై జరిగే అన్యాయాలపై పోరాడుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇలాంటి ప్రకటనల ద్వారా అమెరికా వంటి దేశాల దురుద్దేశాలు బయటపడ్డాయని విమర్శించింది. కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో ఆర్థిక వ్యవస్థలు మందగించిన నేపథ్యంలో పెత్తనం చెలాయించే రాజకీయాలు కాకుండా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందని చైనా అభిప్రాయపడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని