అన్ని మంత్రిత్వశాఖలూ ఒక్కటవ్వాల్సిన తరుణం!

తాజా వార్తలు

Published : 10/02/2020 19:40 IST

అన్ని మంత్రిత్వశాఖలూ ఒక్కటవ్వాల్సిన తరుణం!

కరోనాపై లోక్‌సభలో మంత్రి ప్రకటన

దిల్లీ: చైనాలో మృత్యుకేళి సృష్టిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ తరుణంలో భారత్‌లో నెలకొన్న పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సోమవారం లోక్‌సభలో వివరించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటికే చైనాలో ఈ వైరస్‌ సృష్టించిన కల్లోలంతో 908 మంది ప్రాణాలు కోల్పోగా.. 40వేలకు పైగా ఈ వైరస్‌ బారినపడి అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఈ వైరస్‌ ఇతర దేశాలకూ వ్యాపిస్తోందనీ.. మన దేశంలోని కేరళలో మూడు కేసులు నమోదయ్యాయని మంత్రి వివరించారు. 

ఇతర దేశాలతో రోజూ వీడియో కాన్ఫరెన్స్‌
ఈ వైరస్‌ సోకిన 14 రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయని మంత్రి తెలిపారు. చైనాలోని ఈ వైరస్‌ విజృంభించిన వుహాన్‌ నుంచి వచ్చిన ముగ్గురిలో ఈ వైరస్‌ బారిన పడ్డారనీ.. వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఈ వైరస్‌ తీవ్రత నేపథ్యంలో దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఒక్క ఆరోగ్య మంత్రిత్వశాఖ మాత్రమే కాకుండా అన్ని మంత్రిత్వ శాఖలూ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో పాటు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇతర దేశాలతో రోజూ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్టు హర్షవర్ధన్‌ వెల్లడించారు. మన దేశంలో 9452 మంది నివాసిత కుటుంబాల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. 

ఆ విమాన సిబ్బందికి కృతజ్ఞతలు
దేశంలోని అన్ని విమానాశ్రయాలు,  నౌకాశ్రయాలు, సరిహద్దుల వద్ద ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటిదాకా దిల్లీ, ముంబయి, కోల్‌కతా తదితర విమానాశ్రయాల్లోని 1818 విమానాల్లో మొత్తం 1,97,192 మందిని స్క్రీనింగ్‌ పరీక్షలు చేసినట్టు వివరించారు.  చైనాలోని భారతీయులు, ఇతరులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. జనవరి 31, ఫిబ్రవరి 1న ఎయిరిండియా విమానాన్ని పంపించి చైనాలోని వుహాన్‌ నుంచి 600 మంది భారతీయులు, ఏడుగురు మాల్దీవులకు చెందిన వారిని తీసుకొచ్చి ఈ ప్రాణాంతక మహమ్మారి బారి నుంచి రక్షించామని చెప్పారు. కరోనా కోరలు చాస్తున్న వేళ వుహాన్‌కు వెళ్లి ప్రయాణికులను తీసుకొచ్చిన ఎయిరిండియా విమానం సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని