భారత్‌లో 3 ‘కొవిడ్‌’ కేసులు: కేంద్రం

తాజా వార్తలు

Updated : 13/02/2020 18:47 IST

భారత్‌లో 3 ‘కొవిడ్‌’ కేసులు: కేంద్రం

దిల్లీ: చైనాలో విజృంభిస్తున్న ప్రాణాంతక కొవిడ్‌ -19 (కరోనా వైరస్‌) ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న నేపథ్యంలో భారత్‌లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశంలో ముగ్గురికే కొవిడ్‌ -19 లక్షణాలు ఉన్నట్టు తేలిందని స్పష్టం చేసింది. ఆ మూడు కేసులూ కేరళలోనే నమోదైనట్టు వెల్లడించింది. కొవిడ్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గురువారం దిల్లీలో సమావేశమై దేశంలో నెలకొన్న పరిస్థితితో పాటు సన్నద్ధతపై సమీక్షించింది. అనంతరం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు మొత్తం 15,991 మందిని పరిశీలించినట్టు చెప్పారు. వారిలో 1671 మంది రక్త నమూనాలను వైద్యులు పరీక్షలకు పంపారని వివరించారు. వుహాన్‌ నుంచి వచ్చిన 645 మందిని వైద్య శిబిరాల్లో పరిశీలనలో ఉంచారని తెలిపారు. చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి చెప్పారు.

ఇప్పటివరకు దేశంలోని 21 విమానాశ్రయాల్లో 2,51,447  మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్టు మంత్రి వివరించారు. అంతర్జాతీయ భారీ నౌకాశ్రయాలు, నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కూడా ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కొవిడ్‌పై పరిశోధనలు నిర్వహించే బాధ్యత పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు. దేశంలోని అన్ని మంత్రిత్వశాఖలూ సమన్వయంతో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 28 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయని హర్షవర్ధన్‌ తెలిపారు. ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశామని, కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జపాన్‌లోని డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో భారతదేశానికి చెందిన ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ పరిశీలిస్తోందని తెలిపారు. విదేశాంగ శాఖ ద్వారా చైనాకు కొన్ని వైద్య పరికరాలు, ఇతర సామగ్రి పంపిస్తున్నట్టు మంత్రి వివరించారు.

రాహుల్‌ చాలా సీనియర్‌ నాయకుడు..
చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొవిడ్‌-19పై కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ చేసిన ట్వీట్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘రాహుల్‌ చాలా సీనియర్‌ నాయకుడు. ఓ ముఖ్య నేత కుమారుడు..’ అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై తాను విమర్శలు చేయాలనుకోవడంలేదన్నారు. చైనాలో కొవిడ్‌ విజృంభిస్తుండటంతో దేశ ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు ముప్పు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలేదంటూ నిన్న రాహుల్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని