ట్రంప్‌ కత్తిరించొద్దు: ప్రపంచ దేశాల ఆవేదన

తాజా వార్తలు

Published : 15/04/2020 20:08 IST

ట్రంప్‌ కత్తిరించొద్దు: ప్రపంచ దేశాల ఆవేదన

నిందించి ప్రయోజనం లేదు

అమెరికా ప్రయోజనాలకే నష్టం

ఆరోగ్య సంస్థ ఇప్పుడే అత్యవసరం అంటున్న దేశాలు

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిధులు నిలిపివేశారు. అమెరికా ప్రజల క్షేమాన్ని కోరని ఆ సంస్థకు అమెరికన్లు చెల్లించిన పన్నుల్లోంచి ఒక్క డాలరూ విడుదల చేయనని తెగేసి చెప్పారు. సరైన సమయంలో కచ్చితత్వంతో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను ‘చైనా వైరస్’ అని పదేపదే ఆరోపించారు. ఆయన నిర్ణయంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అవాక్కయ్యాయి. వైరస్‌కు సరిహద్దులు లేవన్నాయి. ఐకమత్యంతో ఉండాల్సిన తరుణంలో ఇలా చేయడం సరికాదని చైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలన్నీ అనడం గమనార్హం. 


ట్రంప్‌ కోపం అందరికీ చేటు: చైనా

ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అన్ని దేశాల్లో ఆరోగ్య సంక్షోభాలను నివారించడంలో డబ్ల్యూహెచ్‌వో కృషిని తక్కువ చేయలేం. డాక్టర్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ ప్రపంచ దేశాలను సమన్వయం చేస్తూ మెరుగ్గా స్పందిస్తున్నారు. నిధులు నిలిపివేస్తే అమెరికా సహా వ్యవస్థలు సరిగ్గా లేని దేశాలపై దీని ప్రభావం ఉంటుంది. ప్రపంచ మహమ్మారులకు వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న డబ్ల్యూహెచ్‌ఓకు చైనా ఎప్పటికీ అండగా ఉంటుంది. ట్రంప్‌ కోపంగా ఉన్నారు. ఇది అమెరికన్ల ప్రయోజనాలనూ దెబ్బతీస్తుంది.


నిందిస్తే ప్రయోజనం లేదు: జర్మనీ

ఇతరుల్ని నిందిస్తే ప్రయోజనం లేదు. వైరస్‌కు ఎలాంటి సరిహద్దులు ఉండవు. ఐక్యరాజ్య సమితిని పటిష్ఠంగా మార్చడమే అత్యుత్తమ పెట్టుబడి. పరీక్షలు చేయడం, వ్యాక్సిన్లును అభివృద్ధి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు తగినన్ని నిధులు లేవు. కొవిడ్‌-19పై అందరం సమష్టిగా పోరాడాలి. ఎలాంటి వివాదాలూ లేవు. నిజానికి అమెరికాలోనూ ఆలస్యంగానే చర్యలు తీసుకున్నారు.


ఐక్యత ముఖ్యం: ఐరోపా కూటమి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. సంస్థకు నిధులు అత్యవసరం. ఇప్పుడు విభజన వైపు కాకుండా ఐక్యత కోసం కష్టపడాలి. ట్రంప్‌ నిర్ణయం పట్ల 27 దేశాల ఐరోపా కూటమి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందరూ ఏకతాటిపైకి వస్తేనే పోరులో విజయం సాధించగలం. సంక్షోభం నుంచి గట్టెక్కగలం.


చైనా, డబ్ల్యూహెచ్‌వోపై సానుభూతి: ఆస్ట్రేలియా

ట్రంప్‌ విమర్శలు చేసిన చైనా, డబ్ల్యూహెచ్‌వోపై సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ అన్నారు. ‘వైరస్‌కు సరిహద్దులు తెలియవు. కొవిడ్‌పై సమష్టిగా పోరాడాలి. నిధులు లేని డబ్ల్యూహెచ్‌వోను పటిష్ఠం చేయాలి. ఇతర దేశాల్లో మహమ్మారులు ప్రబలకుండా చూసేది ఇదే సంస్థ. మునుపటి కన్నా నిధుల అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంది’ అని ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ గ్లోబల్‌ ప్లబిక్‌ హెల్త్‌ ఛైర్‌పర్సన్‌ దేవీ శ్రీధర్‌ అన్నారు.


తీవ్ర విచారకరం: ఆఫ్రికా కూటమి

ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్‌ నిధులు నిలిపివేయడం తీవ్ర విచారకరం. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఈ రోజు ప్రపంచమంతా డబ్ల్యూహెచ్‌వో నాయకత్వంపై ఆధారపడింది. మనందరి సమష్టి సహకారం ఇప్పుడా సంస్థకు అవసరం.


డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడే అత్యవసరం: బిల్‌ గేట్స్‌

నిధులు నిలిపేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తప్పు. ప్రపంచం మొత్తం ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఆ నిర్ణయం అత్యంత ప్రమాదకరం. డబ్ల్యూహెచ్‌వో చర్యల వల్లే కొవిడ్‌-19 వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఒకవేళ ఆ సంస్థ తన పనిని ఆపేస్తే మరే సంస్థా ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌వో అవసరం.


చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్‌ పురుడు పోసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షలకు పైగా కొవిడ్‌-19 బారిన పడ్డారు. లక్ష మందికి పైగా మృతి చెందారు. ఇక డబ్ల్యూహెచ్‌వోకు నిధులు అందించే అతిపెద్ద దాత అమెరికాయే. ఏటా 400-500 మిలియన్‌ డాలర్లు అందిస్తుంది. చైనా ఏడాదికి 40 మిలియన్‌ డాలర్లే ఇవ్వడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని