కరోనాపై గెలవాలి: ఆల్ఫ్స్‌ పర్వతంపై మువ్వన్నెల జెండా

తాజా వార్తలు

Updated : 18/04/2020 18:51 IST

కరోనాపై గెలవాలి: ఆల్ఫ్స్‌ పర్వతంపై మువ్వన్నెల జెండా

జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారిపై భారత పోరాటానికి స్విట్జర్లాండ్‌ సంఘీభావం ప్రకటించింది. సుందరమైన ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లోని ప్రఖ్యాత మ్యాటర్‌హార్న్‌ శిఖరంపై మువ్వన్నెల జెండాను ప్రదర్శించింది. పోరాటంలో గెలిచే విశ్వాసం, సామర్థ్యం భారతీయులకు కలగాలని కోరుకుంది.

స్విస్‌ విద్యుద్దీపాల కళాకారుడు గెరీ హాఫ్‌సెట్టర్‌ స్విట్జర్లాండ్‌, ఇటలీ మధ్యనున్న ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో 4,478 మీటర్ల ఎత్తున్న శిఖరంపై విద్యుద్దీప కాంతులతో వేర్వేరు దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించారు. అన్ని దేశాలు కొవిడ్‌-19పై విజయం సాధించాలని, విశ్వాసంతో ఉండాలని ఈ లైటింగ్‌ సిరీస్‌ను ఆరంభించారు. చీకట్లో మిణుకు మిణుకు చుక్కల్లో పర్వతంపై మెరిసిన మువ్వన్నెల జెండా అందరినీ ఆకట్టుకుంటోంది.

‘ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌ కరోనా వైరస్‌ సంక్షోభంతో బాధపడుతోంది. అంత పెద్ద దేశానికి ఈ సవాల్‌ ఉత్కృష్టమైనది. భారతీయులకు విశ్వాసం, సామర్థ్యం చేకూరాలి. మా సంఘీభావం తెలిపేందుకే  మ్యాటర్‌ హార్న్‌పై భారత పతకాన్ని ప్రదర్శిస్తున్నాం’ అని జెర్మాట్‌ మ్యాటర్ హార్న్‌ పర్యాటక సంస్థ ఫేస్‌బుక్‌లో పెట్టింది. ‘జెర్మాట్‌లోని మ్యాటర్‌హార్న్‌పై 1000 మీటర్ల భారత మువ్వన్నెల పతాకాన్ని ప్రదర్శించారు. కొవిడ్‌-19పై భారతీయులకు పోరాడే విశ్వాసం, సామర్థ్యం కలగాలని స్విట్జర్లాండ్‌ సంఘీభావం తెలిపింది. జెర్మట్‌ పర్యాటక సంస్థ, స్విట్జర్లాండ్‌కు కృతజ్ఞతలు’ అని స్విట్జర్లాండ్‌లోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్‌ చేసింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీనిని సోషల్‌ మీడియాలో అందరితో పంచుకున్నారు. ‘ప్రపంచం సమష్టిగా కొవిడ్‌-19తో పోరాడుతోంది. ఈ మహమ్మారిపై మానవాళి కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని ఆయన రీట్వీట్‌ చేశారు. చైనాలోని వుహాన్‌లో పురుడు పోసుకున్న  కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా 22,42,868 మందికి సోకింది. దాదాపు 1,54,131 మందిని పొట్టనపెట్టుకుంది.

 

 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని