స్వదేశానికి భారతీయులు.. కేంద్రం చర్యలు

తాజా వార్తలు

Published : 05/05/2020 21:32 IST

స్వదేశానికి భారతీయులు.. కేంద్రం చర్యలు

దిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. విదేశాల్లో సుమారు 1.04 కోట్ల మంది భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం అందరినీ భారత్‌కు తీసుకువస్తుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. భారత్‌కు తిరిగి రావడానికి దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. ప్రయాణానికి చట్టబద్ధమైన కారణాలున్న భారతీయులను మాత్రమే తిరిగి స్వదేశానికి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి భారత్‌కు రావాలనుకునే వారు వారి ప్రయాణ ఖర్చులు వారే భరించాలని హోంశాఖ సూచించింది. ప్రతిఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయనున్నట్లు తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

నౌకాదళం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్‌ సముద్ర’

మాల్దీవుల్లో ఉన్న భారతీయులను తరలించేందుకు భారత నావికా నౌకాదళం ‘ఆపరేషన్‌ సముద్ర’ను ప్రారంభించింది.  ఈ క్రమంలో నావికా దళానికి చెందిన 'జలశ్వ', 'మగర్' యుద్ధనౌకలు మాల్దీవులకు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు యుద్ధనౌకల్లో సుమారు 1000 మందిని తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చే భారతీయుల జాబితాను మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ మిషన్ ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ నౌకల ద్వారా తరలించే వారికి వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ కూడా నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సామాజిక దూరం పాటిస్తూ వైద్య సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. మాల్దీవుల నుంచి భారతీయులను కేరళలోని కొచ్చికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని