చైనా, ఇక చాలు అంటున్న అమెరికా

తాజా వార్తలు

Published : 13/05/2020 23:10 IST

చైనా, ఇక చాలు అంటున్న అమెరికా

20 ఏళ్లలో 5 అంటువ్యాధులు

వాషింగ్టన్‌: గత ఇరవై సంవత్సరాలలో చైనా నుంచి ప్రపంచ దేశాలకు ఐదు అంటు వ్యాధులు వ్యాపించాయని... ఇకనైనా ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అమెరికా మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా మరణాలకు కారణమైన కరోనా వైరస్‌కు కూడా చైనాయే జన్మస్థానమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియాన్‌ ఆరోపించారు. అది పరిశోధనా శాలలు, జంతుమాంస మార్కెట్లు ఎక్కడి నుంచైనా కావచ్చు గానీ కొవిడ్‌-19 చైనాలోని వుహాన్‌ నుంచే వచ్చిందనేందుకు ఆధారాలున్నాయని... చైనా వ్యాధులను వెదజల్లడాన్ని ప్రజలు ఇక ఏమాత్రం సహించబోరని రాబర్ట్‌ తెలిపారు. 

రాబర్ట్‌ ఓబ్రియాన్‌ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘సార్స్‌, బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ ఇప్పుడు కొవిడ్‌-19... ఇలా 20 ఏళ్లలో ప్లేగు మాదిరి ఐదు అంటువ్యాధులు చైనా నుంచి వ్యాపించాయి. చైనా వల్ల సంభవించిన ఈ భయంకర పరిస్థితిని ప్రపంచం ఇక ఏ మాత్రం భరించలేదు. దీనికి ఎప్పుడో ఒకసారి అడ్డుకట్ట వేయాల్సిందే.’’ అని ప్రకటించారు. ఐతే ఐదో వ్యాధి ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు.

ప్రజారోగ్య సంక్షోభాల నుంచి బయటపడేందుకు చైనాకు ఇప్పుడు సహాయం అత్యవసరమమని రాబర్ట్‌ అన్నారు. మరోసారి ఈ విధమైన సమస్య తలెత్తకుండా సహాయపడేందుకు వైద్య నిపుణులను పంపిస్తామంటే, చైనా తిరస్కరించిందని ఆయన వెల్లడించారు. తాము చైనా నుంచి వచ్చే మరో వైరస్‌ను భరించేందుకు సిద్ధంగా లేమని... ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చైనా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని రాబర్ట్‌ అన్నారు. చైనా ప్రపంచంపైకి వదిలిన వైరస్‌ల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూతపడిందని... ఈ విధంగా జరగటం ఇదే తొలిసారి కాదన్నారు. ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి వచ్చిన సమస్య అని, ఈ పరిస్థితిని ఎలాగైనా ఆపి తీరాలని రాబర్ట్‌ ఓబ్రియాన్‌  పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని