‘వారి బాధలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి’

తాజా వార్తలు

Published : 16/05/2020 21:48 IST

‘వారి బాధలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి’

వలస కార్మికుల కష్టాలపై మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్య


 

చెన్నై: ‘వలస కార్మికుల దీనావస్థను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇదొక మానవ విషాదం’ అంటూ కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి శనివారం మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించింది. 

‘వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి కొన్ని రోజుల పాటు నడుస్తుండటం, ఈ క్రమంలో వారు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి రక్షణకు చర్యలు తీసుకోవాలి. గత నెల రోజులుగా వారి గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇదొక మానవ విషాదం’ అని ఇరు ప్రభుత్వాల మీద హైకోర్టు మండిపడింది. అలాగే సొంతూరుకు చేరుకోవడానికి కొందరు కూలీలు నడిచి, నడిచి అలసిపోయి ట్రాకుల మీద నిద్రపోయి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద రైలు ప్రమాదానికి గురైన ఘటనను ప్రస్తావించింది. హైకోర్టు ఈ సంక్షోభాన్ని సుమోటోగా తీసుకొని విచారించింది. మే 22లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.  

అయితే మద్రాస్‌ కోర్టు విమర్శలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి స్పందించారు. ‘మిమ్మల్ని తిరిగి పంపించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నాం. అప్పటివరకు శిబిరాల్లో ఉండండి. ప్రయాణ ఖర్చుల గురించి అడుగుతున్నాం. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 53,000మంది కార్మికులను పంపించివేశాం’ అని ఆయన వలస జీవులను అభ్యర్థించారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని