బీజింగ్‌లో లాక్‌డౌన్‌: సెకండ్‌ వేవ్‌ భయం!

తాజా వార్తలు

Updated : 15/06/2020 17:05 IST

బీజింగ్‌లో లాక్‌డౌన్‌: సెకండ్‌ వేవ్‌ భయం!

భారీగా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల నిర్వహణ

బీజింగ్‌:  చైనాలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభణ మొదలైంది. తాజాగా దేశ రాజధాని బీజింగ్‌లోని ఓ అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ మరోసారి వైరస్‌వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఇది బీజింగ్‌ ఆహార సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఈ మార్కెట్‌కు సంబంధించి ఇప్పటివరకు 75మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు దాదాపు పది ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించారు.

సెకండ్‌ వేవ్‌పై భయాలు..!

గత సంవత్సరం వైరస్‌ బయటపడ్డాక డ్రాగన్‌ దీని వ్యాప్తిని నిరోధించింది. దీంతోపాటు తీవ్రత ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్సులో కూడా కొద్ది రోజుల్లోనే కట్టడి చేసింది. కానీ, గత వారం రోజులుగా చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా వైరస్‌ కేసులు  బయటపడుతున్నాయి. కేవలం సోమవారం ఒక్కరోజే 49పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో దాదాపు 36 కేసులకు బీజింగ్‌లోని ఒక హోల్‌సేల్‌ మార్కెట్‌తోనే సంబంధం ఉండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా కరోనా వైరస్‌ కొత్త క్లస్టర్లు ఏర్పడుతుండటంతో దేశంలో సెకండ్‌ వేవ్‌ ఇన్‌ఫెక్షన్‌ మొదలైందనే భయం నెలకొంది.

పది ప్రాంతాల్లో లాక్‌డౌన్‌..

ఇన్ఫెక్షన్‌ వ్యాపిస్తుండటంతో రాజధానిలోని హౌదియన్‌ జిల్లాలో  కూరగాయలు, మాంసం హోల్‌సేలుగా విక్రయించే మార్కెట్‌ను మూసివేశారు. సమీప ప్రాంతాలలో లాక్‌డౌన్‌ విధించి, అక్కడి పాఠశాలలతో పాటు దాదాపు పది నివాస సముదాయాలను కట్టడి చేశారు. దీంతో వేల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమైనట్లు నగర అధికారి లీ జంజీ వెల్లడించారు. అంతేకాకుండా సమీప నగర ప్రజలు బీజింగ్‌కు రావద్దొని ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు.

46వేల మందికి పరీక్షలు..!

భారీ జనసమూహం ఉండే ఆ మార్కెట్‌లో ఎంత మందికి వైరస్‌ సోకిందోననే భయం అధికారుల్లో మొదలైంది. దీంతో టెస్టింగ్‌, ట్రేసింగ్‌పై దృష్టి పెట్టారు. ఆ మార్కెట్‌ సమీపంలో నివసించే వారితోపాటు కొంత కాలంగా అక్కడికి వచ్చిపోయిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలు, కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. పెద్ద సంఖ్యలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సామూహిక నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు బారులు కడుతున్నారు. ఓ స్టేడియంలో ఏర్పాటు చేసిన టెస్టింగ్‌ సెంటర్‌ వద్దకు ప్రజలు హజ్మత్‌ సూట్‌లలో వచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తికి కేంద్రబిందువుగా మారిన ఈ ప్రాంతంలో దాదాపు 46వేల మందికి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, ఇప్పటికే పదివేల మందికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం బీజింగ్‌లో బయటపడుతున్న కరోనా కేసుల్లో కొన్ని విదేశాలనుంచి వచ్చిన చైనీయుల వల్లే సంక్రమిస్తునట్లు అక్కడి అధికారులు గుర్తించారు. తాజాగా బీజింగ్‌లో వైరస్‌ సంక్రమణ పెరుగుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని అక్కడి మీడియా ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి.

 ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్‌ సోకిన 177మందిని గుర్తించగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక చైనాలో బయటపడిన ఈ కరోనా వైరస్‌ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80లక్షల మంది బాధితులు కాగా వీరిలో ఇప్పటి వరకు 4లక్షల 35వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని