నిరాడంబరంగా సీఎం కుమార్తె వివాహం

తాజా వార్తలు

Published : 15/06/2020 17:18 IST

నిరాడంబరంగా సీఎం కుమార్తె వివాహం

ముఖ్యమంత్రి నివాసమే వేదిక

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె, ఐటీ వ్యాపారవేత్త వీణా తయిక్కండియిల్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా(డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడు పీఏ ముహమ్మద్‌ రియాస్‌ సోమవారం వివాహబంధంతో ఒక్కటయ్యారు. కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగిన వేడుకకు తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం వేదికైంది. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. వాటిలో తాళి కట్టు సన్నివేశాన్ని బంధువులంతా సంతోషంగా వీక్షిస్తున్నారు. అయితే, ఆ సమయంలో వారు మాస్కుల విషయంలో పెద్దగా శ్రద్ధ వహించకపోవడం గమనార్హం. 

వీణా బెంగళూరులో ఐటీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వరుడు రియాస్‌ కేరళలో ప్రతి ఇంటికి సుపరిచితులు. ఆయన వివిధ అంశాల మీద టీవీ ఛానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొని, తన గళాన్ని వినిపిస్తుంటారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన గతంలో డీవైఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 2017లో జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గోవధకు వ్యతిరేకంగా పశువుల మార్కెట్ నుంచి జంతువుల కొనుగోళ్లు, అమ్మకాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ 2017లో రియాస్‌ ‘బీఫ్ కుకింగ్’ఆందోళనకు నాయకత్వం వహించారు. 2009లో కొళికోడ్‌లో సీపీఎం తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన పరాజయం పాలయ్యారు. డీవైఎఫ్ఐ..సీపీఎం యువజన విభాగం. ఈ నెల ప్రారంభంలో వీరి వివాహానికి సంబంధించి వార్త తొలిసారి బయటకు వచ్చింది.  

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని