అమెరికా.. మీ జోక్యం అనవసరం: చైనా

తాజా వార్తలు

Published : 09/07/2020 01:54 IST

అమెరికా.. మీ జోక్యం అనవసరం: చైనా

బీజింగ్: టిబెట్‌లో చైనా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ ఆ దేశానికి చెందిన అధికారులపై అమెరికా మంగళవారం నుంచి వీసా ఆంక్షలు విధించింది. తాజాగా దీనిపై చైనా విదేశాంగ స్పందించింది. అమెరికా చర్యను అతిశయమైన ప్రవర్తనగా పేర్కొన్న చైనా, తాము కూడా అమెరికా పౌరులపై వీసా ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఒక ప్రకటన చేశారు. టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌(టీఏఆర్)లో ఇతరుల జోక్యాన్ని బీజింగ్ ఎంత మాత్రం అంగీకరించబోదని తెలిపారు.

‘‘టిబెట్‌కు సంబంధించిన సమస్యల కారణంతో చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దని అమెరికాను కోరుతున్నాం. ఇటువంటి చర్యలు చైనా-అమెరికా దేశాల మధ్య సంబంధాలకు మరింత నష్టం కలిగిస్తాయి. అందుకే అమెరికా తప్పుడు మార్గంలో ముందుక వెళ్లవద్దని కోరుతున్నాం’’ అని అన్నారు. ఇప్పటికే అమెరికా పౌరులతో సహా, దౌత్యవేత్తలు, జర్నలిస్టులు, ఇతర దేశాలకు చెందిన పౌరులను టిబెట్‌లో పర్యటించకుండా చైనా ఆంక్షలు విధించింది. పరిమిత  సంఖ్యలో మాత్రమే పర్యాటకులను అనుమతిస్తుంది. ఒక వేళ ఎవరైనా అతిథులను అనుమతిస్తే ఎల్లప్పుడూ తమ సిబ్బంది వారితో ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

టిబెట్ ప్రాంతంలో చైనా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్‌  పాంపియో మంగళవారం చైనా అధికారులపై వీసా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, జర్నలిస్టులపై చైనా ఆంక్షలకు ప్రతిచర్యగా అమెరికా చైనా అధికారులను లక్ష్యంగా చేసుకొన్నట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే చైనా మాత్రం ఎప్పటిలానే తన వాదనను సమర్థించుకుంది. టిబెట్‌ ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని, విదేశీయులు ఆ ప్రాంతంలో పర్యటించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. టిబెట్ భౌగోళికంగా ప్రత్యేకమైనదని, అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చైనా ప్రభుత్వం విదేశీయులు పర్యటించడంపై కొన్ని నిబంధనలు పాటిస్తుందని వెల్లడించారు.

వాణిజ్యపరమైన సంబంధాల విషయంలో అమెరికా-చైనా మధ్య పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ కారణం చైనానే అమెరికా ఆరోపిస్తున్న సంగంతి తెలిసిందే. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల్లో భారత్‌కు మద్దతుగా అమెరికా వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజారుస్తాయని నిపుణలు అంచనా వేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని