Vaccine: డోసులు వేరైనా రక్షణ ఒకటేనా!
close

తాజా వార్తలు

Published : 18/06/2021 10:27 IST

Vaccine: డోసులు వేరైనా రక్షణ ఒకటేనా!

కొన్ని దేశాల్లో ఓకే అంటున్న అధికారులు
మరింత డేటా అవసరమంటున్న శాస్త్రవేత్తలు

లండన్‌: చాలావరకూ కొవిడ్‌-19 టీకాలను రెండు డోసులుగా ఇస్తున్నారు. రెండు డోసుల్లోనూ ఒకే కంపెనీ వ్యాక్సిన్‌ను పొందాల్సి ఉంటుంది. అవసరమైతే రెండు వేర్వేరు కంపెనీ డోసులను పొందొచ్చా అన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక నిర్ధారణకు రావడానికి ఇంకా డేటా సేకరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న కొవిడ్‌ టీకాలన్నీ.. వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడానికి ఉద్దేశించినవే. అయితే వాటి పనితీరులో వైరుధ్యాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లోని టీకా విభాగం డైరెక్టర్‌ కేట్‌ ఒబ్రెయన్‌ పేర్కొన్నారు. ‘‘టీకాలు పనిచేసే మౌలిక సూత్రం ఒకేలా ఉండటం వల్ల వేర్వేరు డోసులు కూడా పనిచేస్తాయని భావిస్తున్నాం’’ అని ఆమె తెలిపారు.

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకాలతో వేర్వేరు డోసుల విధానంపై పరిశోధనలు జరుపుతున్నారు. స్పెయిన్, జర్మనీల్లోనూ ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. మొదట ఆస్ట్రాజెనెకా టీకా ఆ తర్వాత ఫైజర్‌ వ్యాక్సిన్‌ పొందడం సురక్షితమేనని, ఈ విధానం సమర్థంగానే పనిచేస్తుందని పరిమిత డేటా సూచిస్తోంది. అయితే ఈ మిశ్రమం వల్ల నొప్పులు, చలి వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు తలెత్తవచ్చని పరిశోధకులు చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఈ విధానం వల్ల బలమైన రోగనిరోధక స్పందన వెలువడటం ఇందుకు కారణమై ఉండొచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అరుదైన సందర్భాల్లో ఆరోగ్య శాఖ అధికారులు వేర్వేరు డోసులను అనుమతిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా టీకా అనంతరం కొద్ది మందిలో రక్తంలో గడ్డలు ఏర్పడుతున్న నేపథ్యంలో.. మొదటి డోసు కింద ఈ టీకా పొందినవారు రెండో డోసు కింద ఫైజర్‌ లేదా మోడెర్నా వ్యాక్సిన్‌ను పొందాలని ఐరోపాలోని కొన్ని దేశాల్లో సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని