3 నెలల్లో 10% జనాభాకు టీకా వేస్తేనే కరోనాపై విజయం

తాజా వార్తలు

Updated : 02/07/2021 10:16 IST

3 నెలల్లో 10% జనాభాకు టీకా వేస్తేనే కరోనాపై విజయం

డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్‌ వెల్లడి

లండన్, న్యూయార్క్‌:  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌పై విజయం సాధించాలంటే ఈ ఏడాది సెప్టెంబరుకల్లా ప్రతి దేశం కనీసం 10 శాతం జనాభాకు టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధినేత టెడ్రోస్‌ అథనోమ్‌ పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివరికి 40 శాతం మందికి, వచ్చే ఏడాది సగానికి 70 శాతం జనాభాకు టీకా అందించాలని సూచించారు. మహమ్మారిని అంతం చేసి ప్రపంచ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి అదొక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇండియా గ్లోబల్‌ ఫోరమ్‌ వర్చువల్‌ విధానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అసమానతలే మహమ్మారి వ్యాప్తికి కారణం. కొన్ని దేశాలు అధిక శాతం జనాభాకు టీకా అందించగలిగాయి. చాలా దేశాల్లో కనీసం ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు కూడా టీకా పంపిణీ జరగలేదు. ఈ తరహా పరిస్థితి ఇతర దేశాలకూ ప్రమాదకరమే’నని టెడ్రోస్‌ తెలిపారు. మహమ్మారిని అన్ని చోట్లా అంతం చేయకపోతే దాని నుంచి మనకు ప్రమాదం ఉన్నట్లే అని హెచ్చరించారు.

ఆ టీకా గ్రహీతలను అనుమతించాలి

తమ ద్వారా అత్యవసర వినియోగ అనుమతి పొందిన ఏ టీకాను వేసుకున్న ప్రయాణికులనైనా దేశాల్లోకి అనుమతించాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అలా జరగనట్లయితే ఇప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలపై మరింత ప్రభావం పడుతుందని హెచ్చరించింది. చైనా, రష్యా తయారీ వ్యాక్సిన్లపై ఐరోపా దేశాలు అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో గురువారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.
మాతృదేశానికి భారతీయ అమెరికన్ల సాయం
కరోనా వైరస్‌పై పోరాటంలో అండగా నిలిచేందుకు అమెరికాలో ఉన్న భారత సంతతి ప్రజలు తమ మాతృదేశానికి పెద్ద మొత్తంలో వైద్య పరికరాలను పంపించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌ రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఐఏ) తాము సేకరించిన 300 వెంటిలేటర్లు, 3000 వెంటిలేటర్ల సర్క్యూట్లు, ఫిల్టర్లు, 100 పోర్టబుల్‌ వెంటిలేటర్లు, 3.10లక్షల పల్స్‌ ఆక్సీమీటర్లను ముంబయి, దిల్లీలకు కార్గో ద్వారా చేరవేస్తోంది.

జైకోవ్‌-డి టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు

దిల్లీ: భారత ఔషధ సంస్థ జైడస్‌ కాడిలా తమ మూడు డోసుల జైకోవ్‌-డి కరోనా టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకున్నట్లు గురువారం వెల్లడించింది. భారత్‌లో 50 కేంద్రాల్లో క్లినికల్‌ పరీక్షలు జరిపామని, మన దేశంలో 12-18 ఏళ్ల వయసువారిపైనా ప్రయోగాలు జరిపిన తొలి కొవిడ్‌ టీకా కూడా ఇదేనని ఆ సంస్థ డీసీజీఐకి వివరించింది. సుమారు వెయ్యి మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారని, ఈ పరీక్షల్లో టీకా సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. ఇది 66.6 శాతం సమర్థతతో పనిచేసినట్లు ప్రాథమికంగా రుజువైందన్నారు. మానవుల వినియోగానికి రూపొందించిన తొలి ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ టీకా ఇదని, దీనికి అనుమతులు లభిస్తే పెద్దలతో పాటు 12-18 ఏళ్ల వారికి రక్షణ కలుగుతుందని సంస్థ ఎండీ శర్విల్‌ పటేల్‌ తెలిపారు. ఆగస్టు రెండో వారం తర్వాత ఉత్పత్తిని ప్రారంభించే యోచన ఉందని, నెలకు కోటి డోసులను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇప్పటివరకూ టీకా ఆవిష్కరణకు సుమారు రూ.500 కోట్లు వెచ్చించామన్నారు.

దమణ్, దీవ్‌లో తొలి డోసు పంపిణీ పూర్తి 

కొవిడ్‌ టీకాల పంపిణీలో దమణ్, దీవ్‌ సత్తా చాటాయి. ఈ రెండు జిల్లాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ (18 ఏళ్లు దాటినవారు) తొలి డోసు అందింది. కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌లో ఈ రెండు జిల్లాలు ఉన్న సంగతి గమనార్హం. జూన్‌ ముగింపు నాటికి వాటిలో తొలి డోసు పంపిణీ 100 శాతం పూర్తయిందని స్థానిక అధికారి ఒకరు గురువారం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని