Delta Variant: రెండు డోసులతోనే డెల్టా నుంచి రక్షణ.. ఫ్రాన్స్‌ పరిశోధనలో వెల్లడి 

తాజా వార్తలు

Published : 23/07/2021 12:32 IST

Delta Variant: రెండు డోసులతోనే డెల్టా నుంచి రక్షణ.. ఫ్రాన్స్‌ పరిశోధనలో వెల్లడి 

లండన్‌: డెల్టా రకం కరోనా వేరియంట్‌.. యాంటీబాడీలకు ఒకింత తక్కువగా స్పందిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకే డోసు టీకాతో పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. రెండు డోసులతో చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉంటుందన్నారు. ఆల్ఫా రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ 50 శాతం ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. కరోనాలో మొదట వెలుగు చూసిన రకంతో పోలిస్తే.. ఆల్ఫా రకం 50 శాతం వేగంగా సంక్రమిస్తున్నట్లు వివరించారు. ఫ్రాన్స్‌లోని పాశ్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌ దీనిపై పరిశోధన నిర్వహించింది. వీరు కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా వైరస్‌ రకాలు.. భిన్నరకాల యాంటీబాడీలకు ఏ మేర స్పందిస్తున్నాయన్నది పరిశీలించారు. వారు పరిశోధించిన యాంటీబాడీలివీ.. 

1. కొవిడ్‌ బాధితుల చికిత్సకు వాడుతున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీలు. 2. ఆరు నెలల కిందట కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల్లోని యాంటీబాడీలు. 3. కొవిడ్‌ నుంచి కోలుకొని, టీకా పొందిన వ్యక్తుల నుంచి సేకరించిన యాంటీబాడీలు. 4. కరోనా సోకని వ్యక్తుల్లో టీకా వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీలు.

ఔషధ కంపెనీలు ఉత్పత్తిచేస్తున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీల్లో నాలుగు రకాలను ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు పరీక్షించారు. మూడు రకాలు డెల్టా వేరియంట్‌ను అడ్డుకున్నాయని, బీటా వేరియంట్‌పై మాత్రం రెండు రకాలే పనిచేశాయని గుర్తించారు. అయితే మన రోగ నిరోధక వ్యవస్థ.. అనేక రకాల యాంటీబాడీలను తయారుచేస్తుంది. వీటిలో.. డెల్టా వేరియంట్‌ను నిలువరించే యాంటీబాడీలు ఉంటాయా అన్నది పరిశీలించారు. కొవిడ్‌ నుంచి ఆరు నెలల కిందట కోలుకున్న 56 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఆల్ఫా రకంతో పోలిస్తే బీటా, డెల్టా వేరియంట్లను ఆరు రెట్లు తక్కువగా ఈ యాంటీబాడీలు నిర్వీర్యం చేస్తున్నాయని గుర్తించారు. 
ఒకే డోసుతో యాంటీబాడీ స్పందన చాలా తక్కువ

గతంలో ఇన్‌ఫెక్షన్‌ సోకినవారు టీకా పొందినప్పుడు వారిలోని యాంటీబాడీలు మూడు వేరియంట్లపై మెరుగ్గా పనిచేస్తున్నట్లు తేలింది. అయితే గతంలో ఇన్‌ఫెక్షన్‌కు గురికాని వ్యక్తి ఒకే డోసు తీసుకుంటే.. యాంటీబాడీ స్పందన చాలా తక్కువగా ఉంటుందని వెల్లడైంది. రెండు డోసులు పొందితే.. డెల్టా వేరియంట్‌ను సమర్థంగా అడ్డుకోవచ్చని తేలింది. అయితే ఆల్ఫా రకంపై కన్నా తక్కువ సమర్థతతోనే ఇవి పనిచేస్తాయని వెల్లడైంది. వ్యాక్సిన్లు ఇప్పటికీ సమర్థమైనవేనని అధ్యయనాలు చెబుతున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని