బైడెన్‌ జాగ్రత్త.. ప్రశాంతంగా నిద్రపోలేవు..!

తాజా వార్తలు

Published : 16/03/2021 14:12 IST

బైడెన్‌ జాగ్రత్త.. ప్రశాంతంగా నిద్రపోలేవు..!

 అమెరికా అధ్యక్షుడికి కిమ్‌ చెల్లి తొలి వార్నింగ్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: మా జోలికి వస్తే మీకు కంటిమీద కునుకు కరవవుతుందంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలు చేసింది ఎవరో కాదు.. ఉత్తర కొరియాలో నంబర్‌ 2 నేతగా చలామణి అవుతున్న కిమ్‌ సోదరి..! ప్యాంగ్‌యాంగ్‌ నుంచి బైడెన్‌కు ఇవే తొలి హెచ్చరికలు.  తాజాగా అమెరికా రక్షణ, విదేశాంగశాఖ మంత్రులు జపాన్‌, దక్షిణ కొరియాల్లో పర్యటించనుండటంతో ఈ హెచ్చరికలు  జారీ అయ్యాయి.

సోమవారం నుంచి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకన్‌లు జపాన్‌లో పర్యటిస్తున్నారు. బైడెన్‌ కార్యవర్గంలో వీరు బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఈ పర్యాటనలో చైనా, ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా మిత్రదేశాలతో సైనిక సంబంధాలను పటిష్ఠం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ స్పందించారు. ఆమె ఉ.కొరియా పత్రిక రోడాంగ్‌ సిన్‌మున్‌కు ఓ ప్రకటన జారీ చేశారు. ‘‘మా భూమిపై గన్‌పౌడర్‌ వాసనను వ్యాపింప జేయాలనుకుంటున్న అమెరికా కొత్త పాలక వర్గానికి సలహా ఇస్తున్నాను. మీరు వచ్చే నాలుగేళ్లు నిశ్చింతగా నిద్రపోవాలనుకుంటే.. కంటిమీద కునుకు దూరం చేసే పనులు చేయవద్దు’’ అని ఘాటుగా హెచ్చరించారు. గత వారం అమెరికా-దక్షిణ కొరియాలు సంయుక్తంగా యుద్ధవిన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే.

జనవరిలో బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక  ఉత్తర కొరియా ఓ సబ్‌మెరైన్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆ దేశ సుప్రీం లీడర్‌ కిమ్‌ స్పందిస్తూ.. అమెరికానే ఉత్తరకొరియాకు తొలి శత్రువని ప్రకటించారు. 2019 వియత్నాంలోని హనోయ్‌లో అమెరికా-ఉ.కొరియా చర్చలు విఫలమైనప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాల్లో పురోగతి లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని