పేద దేశాల్లో ఇదే ఆఖరి తరం అవుతుంది

తాజా వార్తలు

Published : 06/02/2021 15:59 IST

పేద దేశాల్లో ఇదే ఆఖరి తరం అవుతుంది

అసమానతలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆందోళన

వాషింగ్టన్‌: పేద, అల్పాదాయ దేశాలకు సంపన్న దేశాలు ఆపన్నహస్తం అందించకపోతే అక్కడ ఇదే చివరితరం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల వృద్దిలో విభేదాలు అస్థిరత్వానికి, సామాజిక అశాంతికి దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. 

‘గతేడాది ప్రపంచ దేశాల దృష్టి అంతా లాక్‌డౌన్‌పైనే ఉంది. అయితే ఈ ఏడాది మనం దేశాల మధ్య వృద్ధి విభేదాలను ఎదుర్కోనున్నాం. కొన్ని దశాబ్దాలుగా ఆదాయ స్థాయిలను మెరుగుపర్చుకుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుతం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ దేశాల్లో జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఫలితంగా స్థిరత్వం, శాంతికి భంగం వాటిల్లే ముప్పు పొంచి ఉంది’ అని క్రిస్టాలినా చెప్పారు. కొవిడ్‌పై పోరులోనూ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడ్డాయని ఆమె తెలిపారు. మహమ్మారి సమయంలో సంపన్న దేశాలు సగటున తమ జీడీపీలో 24శాతం కరోనాపై పోరుకు వెచ్చిస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు 6శాతం, పేద దేశాలు కేవలం 2శాతమే ఖర్చు చేయగలిగాయన్నారు. 

టీకా పంపిణీ చర్యల్లో కూడా దేశాల మధ్య భారీ అసమానతలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికాలో కేవలం ఒకే ఒక్క దేశం మొరాకా మాత్రమే ఇప్పటివరకు  వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టగలిగిందని అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మిగతా ఆఫ్రికా దేశాల్లో మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదముందని ఆవేదన చెందారు. ఈ ప్రమాదకర విభేదాలను మార్చేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, పేద దేశాలకు సంపన్న దేశాలు అన్ని విధాల సహాయసహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లేదంటే ఆయా దేశాల్లో ఇదే ఆఖరి దశాబ్దం, ఆఖరి తరం అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇవీ చదవండి..

ఊపిరి పీల్చుకుంటున్న అమెరికా

15 దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని