ఎమ్మెల్యే అయిఉండి ఏమీ చేయలేకపోతున్నా

తాజా వార్తలు

Updated : 30/04/2021 12:48 IST

ఎమ్మెల్యే అయిఉండి ఏమీ చేయలేకపోతున్నా

దిల్లీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి: ఆప్‌ నేత

న్యూదిల్లీ : దేశ రాజధాని దిల్లీలో నెలకొన్న కరోనా ఉద్ధృతి పరిస్థితులపై అధికార పార్టీ ఆప్‌ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని దిల్లీ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో సందేశం విడుదల చేశారు. 

‘‘దిల్లీలో నెలకొన్న పరిస్థితులు నన్ను తీవ్ర దుఃఖానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి దయనీయ పరిస్థితులు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఆక్సిజన్‌, ఔషధాలు అందుబాటులో లేవు. నా స్నేహితుడు ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు. ఆయనకు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి సదుపాయలేవీ కల్పించలేకపోతున్నాం. అతని కోసం రెమ్‌డెసివిర్‌ ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో అర్థం కావడం లేదు. ఓ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఎవరికీ సహాయం చేయలేకపోవడంపై నేను సిగ్గుపడుతున్నా. ప్రభుత్వం కూడా మాకు సహకరించడం లేదు. నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను. అయినా నా మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఏ అధికారినీ సంప్రదించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని దిల్లీ హైకోర్టును విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే మరణాలు పెరిగి రోడ్లపై శవాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది’’ అని వీడియో సందేశంలో షోయబ్‌ ఇక్బాల్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

షోయబ్‌ ఇక్బాల్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించింది. సీఎం కేజ్రీవాల్‌ దిల్లీని దయనీయ పరిస్థితుల్లోకి నెట్టారని ఆరోపించింది. సీఎం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని విమర్శించింది.

దిల్లీలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. వరుసగా ఎనిమిది రోజులుగా 300కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం ఏకంగా 395 మంది మృత్యువాత పడ్డారు. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే కొత్తగా 24,235 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 32.82 శాతంగా ఉంది. ప్రస్తుతం 97,977 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఆసుపత్రుల్లో 21,152 పడకలకుగానూ 1,628 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మరో 53,440 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని