న్యూజిలాండ్‌ యూట్యూబర్‌పై భారత్‌ నిషేధం 

తాజా వార్తలు

Published : 11/07/2021 01:05 IST

న్యూజిలాండ్‌ యూట్యూబర్‌పై భారత్‌ నిషేధం 

దిల్లీ: ప్రముఖ యూట్యూబర్‌, న్యూజిలాండ్‌కు చెందిన కార్ల్‌ ఎడ్వర్డ్‌ రైస్‌ అలియాస్‌ కార్ల్‌ రాక్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ వచ్చే ఏడాది వరకు అతడు భారత్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన అతడు ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అందుకే అతడి పేరును బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపింది. అయితే గతేడాది అక్టోబరులోనే అతడి వీసాను రద్దు చేయగా.. కార్ల్‌ రాక్‌ తాజాగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

న్యూజిలాండ్‌కు చెందిన కార్ల్‌ రాక్‌ ట్రావెల్‌ సేఫ్టీ, పర్యాటక ప్రదేశాలపై వీడియోలు చేస్తుంటాడు. అతడి యూట్యూబ్‌ ఛానల్‌కు 1.8 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గత పదేళ్లుగా భారత్‌లోనే ఉంటున్న అతడు.. 2019లో దిల్లీకి చెందిన మనీశా మాలిక్‌ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల తన వీసాను భారత ప్రభుత్వం రద్దు చేసిందని, తిరిగి దేశానికి రాకుండా తన పేరును బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చిందని రాక్‌ నిన్న తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.

‘‘2020 అక్టోబరులో దుబాయి, పాకిస్థాన్‌ వెళ్లేందుకు నేను భారత్‌ నుంచి బయల్దేరాను. ఆ సమయంలో ఎయిర్‌పోర్టు వద్ద నా వీసాను అధికారులు రద్దు చేశారు. ఎందుకు చేశారో నాకు చెప్పలేదు. దీంతో దుబాయి వెళ్లాక నేను కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాను. అయితే నా పేరు బ్లాక్‌ లిస్టులో చేర్చారని, అందుకే కొత్త వీసా ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు నాకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. దీంతో గత కొన్ని నెలలుగా నేను భార్యకు దూరంగా ఉండాల్సి వస్తోంది’’ అని రాక్‌ చెప్పుకొచ్చాడు. 

అయితే ఈ వీడియోపై కేంద్ర హోంశాఖ అధికారులు స్పందించారు. ‘‘కార్ల్‌ రాక్‌ టూరిస్టు వీసాపై వచ్చి భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అందుకే ఆయన వీసాను రద్దు చేశాం. వచ్చే ఏడాది వరకు ఆయనకు భారత్‌లో ప్రవేశంపై నిషేధం విధించాం’’ అని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని