India-China: ఆ రోడ్డు కోసమే చైనా నాటకాలు..

తాజా వార్తలు

Updated : 12/10/2021 15:51 IST

India-China: ఆ రోడ్డు కోసమే చైనా నాటకాలు..

 చర్చలు విఫలమైన నేపథ్యంలో గ్లోబల్‌ టైమ్స్‌ తాటాకు చప్పుళ్లు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై చర్చలకు ముందు నుంచే డ్రాగన్‌ ప్రతికూల సంకేతాలు పంపడం మొదలుపెట్టింది. ఎటవంటి ఫలితం వెలువడకూడదనే లక్ష్యంతోనే చైనా చర్చలకు వచ్చినట్లుంది. చర్చలకు ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్దకు 200 మంది సైనికులను పంపింది. భారత్‌ సైన్యం వీరిని అడ్డుకొంది. ఆగస్టులో బారాహోతి వద్దకు 100 మంది జవాన్లను పంపగా.. వీరు భారత భూభాగంలో వంతెనను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. చర్చలకు ముందు ఇలాంటి చర్యలతో భారత్‌పై ఒత్తిడి పెంచాలని చూసింది.

ఈ ప్రాంతం ప్రాముఖ్యత ఏమిటీ..?

హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రాపోస్టులు అంత్యంత కీలకమైనవి. గోగ్రా పోస్టుపై గత చర్చల్లో ఒప్పందం కుదిరింది. చాంగ్‌ చెన్మో నదికి రెండు వైపులా ఉన్న ఈ ప్రాంతాలు చాలా కీలకం. తూర్పు వైపు గోగ్రా పోస్టు, ఉత్తరం వైపు హాట్‌ స్ప్రింగ్స్‌ ఉంటాయి. ఆగ్నేయం వైపు నంచి వస్తున్న ఈ నది గోగ్రాపోస్టు వద్ద నైరుతి వైపు మలుపు తిరుగుతుంది. ఈ ప్రాంతం కారాకోరం పర్వతాలకు ఉత్తరం వైపు ఉంది. ఇది ఖాంగ్‌కా పాస్‌ సమీపంలో ఉంటుంది. ఈ పాస్‌ చైనాలోని షింజియాంగ్‌- భారత్‌లోని లద్దాఖ్‌ ప్రాంతాన్ని వేరుచేస్తుంటుంది. ఈ పాస్‌కు సమీపంలోని దౌలత్‌బేగ్‌ ఓల్డీ వద్ద భారత వైమానిక స్థావరం ఉంది. ఈ పాస్‌ను భారత్‌-చైనా మధ్య సరిహద్దుగా డ్రాగన్‌ భావిస్తుంది. కష్గర్‌-లాసా వెళ్లే  కీలకమైన 219 హైవే భారత్‌కు అత్యంత సమీపంగా వెళుతుంది. యుద్ధ సమయంలో భారత్‌ దీనిపై దాడి చేస్తుందనే భయాలు చైనాలో ఉన్నాయి. దీంతో ఈ హైవేపై దాడి చేయడానికి అవకాశం ఉన్న దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, చుషూల్‌, దెమ్‌చొక్‌లపై భారత్‌ పట్టు తప్పించాలని డ్రాగన్‌ చూస్తోంది. అందుకే హాట్‌ స్ప్రింగ్స్‌ నుంచి చైనా వెనక్కి తగ్గేందుకు ఆసక్తి చూపడంలేదు. దీనికి భారత్‌ను కారణంగా చూపే యత్నం చేస్తోంది.

తప్పు భారత్ నెత్తిన రుద్దే యత్నం

ఇటీవల 8గంటల పాటు జరిగిన భారత్‌-చైనా కోర్‌కమాండర్‌ స్థాయి సమావేశం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా ముగిసింది. చర్చలు పురోగతి సాధించకూడదన్న లక్ష్యంతోనే చైనా అధికారులు వచ్చినట్లు అనిపిస్తోంది. ఒక దశలో చైనా వెస్ట్రర్న్‌ థియేటర్‌ కమాండర్‌ ప్రతినిధి సీనియర్‌ కర్నల్‌ లాంగ్‌ షావ్‌హో మాట్లాడుతూ ‘‘పరిస్థితిని తప్పుదోవపట్టించడం భారత్‌ మానుకోవాలి. సరిహద్దుల్లో భారత్‌ కోరుకొన్నది అంత తేలిగ్గా జరగదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అంటూ బెదిరింపులకు యత్నించాడు. దీంతో హాట్‌ స్ప్రింగ్స్‌, ఇతర పెట్రోలింగ్‌ పాయింట్ల వద్ద ఉద్రిక్తతలు అంత తేలిగ్గా తగ్గవని తేలిపోయింది.

గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటోరియల్‌‌..

ఒక రోజు తర్వాత ఇలాంటి రాగాన్నే చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్‌టైమ్స్‌’ కూడా అందుకొంది. ‘‘భారత్‌ ఓ విషయం గుర్తుంచుకోవాలి. భారత్‌ అనుకున్న ఫలితాలు సరిహద్దుల వద్ద లభించవు. ఒక వేళ ఆ దేశం యుద్ధం ప్రారంభిస్తే.. ఓటమి ఖాయం. ఎటువంటి రాజకీయ మార్పులు, ఒత్తిళ్లను చైనా ఏమాత్రం పట్టించుకోదు. భారత్‌లో సరిహద్దు వివాదాన్ని డీల్‌ చేసే విషయంలో చైనా రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. చైనాకు చెందిన భూమి ఎప్పటికీ చైనాదే. అది ఎప్పటికీ మారదు. భారత్‌ ఇంకా నిద్రలో నడుస్తున్నట్లే వ్యవహరిస్తోంది. అది స్పృహలోకి వస్తుందేమో ఎదురు చూడాలి. భారత్‌, చైనాలు రెండూ శక్తిమంతమైన దేశాలే. ఈ విషయం చైనాకు తెలుసు. కానీ, భారత్‌ ఏదో చేద్దామని భావిస్తోంది. పరిస్థితిని తప్పుదోవ పట్టిస్తూ చైనాను భారత్‌ తక్కువగా అంచనా వేస్తోంది. చివరికి ఆ అంచనాలతో నష్టపోవాల్సి వస్తుంది. చైనా-అమెరికా మధ్య విభేదాలను వ్యూహాత్మక భేరాలకు భారత్‌ ఓ అవకాశంగా భావిస్తోంది. అమెరికా కూటమిలోకి భారత్‌ వెళ్లకుండా చేసేందుకు సరిహద్దు విషయంలో చైనా కొంత మెత్తబడుతుందని భావిస్తున్నట్లుంది.  ఏది ఏమైనా భారత్‌-చైనా మధ్య సమస్య మిగిలి ఉంది. దీనికి మూలకారణాల్లో మార్పు రాలేదు. చర్చల విషయంలో భారత్‌ వైపు సరైన వ్యవహార శైలి లేదు. వారి డిమాండ్లు వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవు’’ అంటూ బెదిరింపు ఎడిటోరియల్‌ను ప్రచురించింది.

భారత్‌లో తైవాన్‌కు మద్దతుపై డ్రాగన్‌కు మంట..

లద్దాఖ్‌లో ఇరు దేశాల కోర్‌ కమాండర్ల చర్చల తేదీ, తైవాన్‌ జాతీయ దినోత్సవం ఒకే రోజు వచ్చాయి. దీంతో దిల్లీలో తైవాన్‌కు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. తైవాన్‌కు సంబంధించిన ఏ అంశాన్నైనా  చైనా చాలా తీవ్రంగా తీసుకొంటుంది. ప్రైవేటు వ్యక్తులు అతికించిన పోస్టర్లు, బ్యానర్లపై కూడా భారత్‌లోని చైనా రాయబారి బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. భారత్‌లోని వ్యక్తులు, మీడియా తైవాన్‌ స్వాతంత్ర్య అంశానికి వేదికలుగా మారుతున్నాయని మండిపడ్డారు.

మలబార్‌ యద్ధవిన్యాసాల ముందు..

భారత్‌ మలబార్‌ యుద్ధవిన్యాసాల్లో పాల్గొనడం ఎప్పటి నుంచో చైనాకు ఏమాత్రం ఇష్టంలేదు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ను కట్టడి చేయడానికే ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారని భావిస్తోంది. బంగాళాఖాతంలో నిర్వహిస్తోన్న ఈ విన్యాసాల్లో క్వాడ్‌ సభ్య దేశాలు మొత్తం పాల్గొనడం చైనాకు కంటగింపుగా మారింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని