16 మందిని కాపాడిన ఐటీబీపీ: వీడియో వైరల్‌

తాజా వార్తలు

Published : 08/02/2021 01:53 IST

16 మందిని కాపాడిన ఐటీబీపీ: వీడియో వైరల్‌

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని చమోలీలో మంచు చరియలు విరిగిపడి ధౌలి గంగా నది ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఈ వరద ఉద్ధృతి ప్రమాదంలో తపోవన్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద టన్నెల్‌లో చిక్కుకున్న 16 మందిని ఐటీబీపీ జవాన్లు సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో టన్నెల్‌లో ఉన్న కార్మికులు అలాగే బురదలో చిక్కుకుపోయారు. ఐటీబీపీ సిబ్బంది సాహసోపేతంగా టన్నెల్‌లోకి దిగి అందులో చిక్కుకున్న వ్యక్తుల్ని ప్రాణాలతో బయటకు తీశారు. ఓ వ్యక్తిని టన్నెల్‌లో నుంచి ప్రాణాలతో బయటకు తీసిన వెంటనే అతడు సంతోషంతో పులకరించిపోయిన దృశ్యం అక్కడి వారిని ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రాణాలతో బయటపడిన వారందరికీ ఐటీబీపీ సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.

మృతులకు ప్రభుత్వ పరిహారం

ధౌలీ గంగా నది వరద ఉద్ధృతి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బాధితుల్లో ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు. నీటి స్థాయిని కట్టడి అయిందని.. ఇక గ్రామాలు, పవర్‌ ప్రాజెక్టులకు వరద ముప్పు ఏం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి దిగ్బ్రాంతి

ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్‌ వద్ద మంచుచరియలు విరిగిపడి ఆదివారం వరదలు పోటెత్తిన వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న సహాయక చర్యలు పురోగతి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సోనియా గాంధీ విచారం

ఉత్తరాఖండ్‌లో ధౌలీ నది వరద ప్రమాదంపై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ స్పందించారు. ప్రమాద ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ‘అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొని అధికారులకు సహకరించాలి. ఈ విషాద సమయంలో ఉత్తరాఖండ్‌ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది’ అని తెలిపారు. 

ఇదీ చదవండి

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని