Japan: ఆఫీస్‌కు వారంలో నాలుగు రోజులే!

తాజా వార్తలు

Updated : 25/06/2021 22:18 IST

Japan: ఆఫీస్‌కు వారంలో నాలుగు రోజులే!

ఉద్యోగం, కుటుంబం మధ్య సమన్వయం కోసమే..

కీలక సిఫార్సులు చేసిన జపాన్ ప్రభుత్వం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనాప్రభావం, అధిక పనిగంటలు, జనాభా పెరగకపోవడం.. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోన్న ఉద్యోగుల కోసం జపాన్ ప్రభుత్వం కీలక సిఫార్సులు చేసింది. వారంలో నాలుగు దినాలు మాత్రమే పనిచేయడానికి సంస్థలు అనుమతించేలా ప్రతిపాదనలను ముందుకుతెచ్చింది. ఉద్యోగం, కుటుంబం రెండింటి మధ్య ప్రజలు సమతౌల్యాన్ని సాధించేందుకు ఈ సూచనలు ఉపకరిస్తాయని భావిస్తోంది. ఇప్పుడున్న సౌకర్యవంతమైన పనిగంటలు, ఇంటినుంచి పని వంటి సదుపాయాలను కరోనా సంక్షోభం ముగిశాక కూడా కొనసాగేలా చూడాలని యోచిస్తోంది. అందుకు తగ్గట్టుగా యాజమాన్యాలను ఒప్పించే దిశగా పయనిస్తోంది.

ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగులకు ప్రయోజనాలు!

ఈ నాలుగు రోజుల పనిదినాలతో ఉద్యోగులు కుటుంబంతో గడిపే సమయం గణనీయంగా పెరగనుంది. చిన్నారులను చూసుకోవడంతో పాటు, వృద్ధుల బాగోగులను పట్టించుకునే వీలు కలుగనుంది. పనిగంటలు తగ్గడంతో వారిపై ఒత్తిడి కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవే కాకుండా.. ఖాళీ సమయం ఉండటంతో తమ విధులకు సంబంధించిన అర్హతలు పెంచుకునే వీలు కలుగుతుంది. సిబ్బంది మిగిలిన రోజులు మరో ఉద్యోగమూ చేయొచ్చు, కుటుంబంతో బయటికెళ్లి సరదాగా గడపవచ్చు. కరోనాతో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతం ఇవ్వనుందని ప్రభుత్వం యోచన. ప్రజలు హాయిగా విహారాలకు వెళ్లి, తమకు నచ్చినవి కొనుగోలు చేయడంతో వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడుతాయని  భావిస్తోంది. మరీ ముఖ్యంగా పడిపోతున్న జననాల రేటుకు అడ్డుకట్ట వేసేందుకు ఈ సిఫార్సులు దోహదం చేస్తాయని ఆశిస్తోంది. జీవితంలో దొరికిన ఈ ఖాళీ సమయం వల్ల యువతీయువకులు ఒకరినొకరు అర్థం చేసుకొని, వివాహం వైపు మొగ్గుచూపి, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతారని జపాన్‌ ప్రభుత్వాధినేతల అభిప్రాయం. జననాల రేటు పడిపోతూ, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ సిఫార్సులు దేశానికి మంచి చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే వారానికి నాలుగురోజుల పని అమలులోకి రావాలంటే.. జపాన్‌ సంస్థలు ఆ దిశగా ఆలోచించాల్సి ఉంటుంది. సంస్థల్లో పాతుకుపోయిన వైఖరిలో మార్పుకోసం ప్రభుత్వం చూస్తోందని ఆర్థిక నిపుణుడు మార్టిన్ ష్కుల్జ్‌ అన్నారు. మందగించిన ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం తెచ్చేందుకు సెంట్రల్ బ్యాంకు విధానాలు పరిమితంగానే ఉపయోగపడనున్నాయి. అయితే మహమ్మారి కారణంగా సంస్థలు తమ కార్యకలాపాల్లో మార్పులు చేశాయని, క్రమంగా ఉత్పాదకతలో పెరుగుదలను చూస్తున్నాయని ష్కుల్జ్ వెల్లడించారు.
 
ప్రాణాల మీదకు తెస్తోన్న అధిక పనిగంటలు..
సంప్రదాయ విధానాలు అంత ప్రభావశీలంగా లేవనే ఆధారాలున్నప్పటికీ.. తర తరాలుగా పాతుకుపోయిన వైఖరి నుంచి సంస్థలు బయటకురావనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోపక్క తక్కువ పని రోజులు ఉద్యోగులకు ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ వేతనాల్లో కోతగురించి వారు ఆలోచిస్తున్నారు. ఈ విధానంతో వారు పూర్తిగా సంస్థకు కట్టుబడి ఉండరనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బిజినెస్‌ స్టడీస్‌లో డిగ్రీ పట్టా అందుకున్న జుంకో షిజెనోకు పెద్దపెద్ద సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. తను మాత్రం తన ఇంటికి దూరంలో ఉన్న చిన్నపాటి ఐటీ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఎందుకని ప్రశ్నిస్తే.. అక్కడి పని వాతావరణం తనకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు. ‘నాకు ఆఫర్‌ ఇచ్చిన సంస్థల గురించి నేను చాలా శోధించాను. అక్కడున్న కొందరితో మాట్లాడాను. ఉద్యోగాన్ని, కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసుకుంటున్నారనే ప్రశ్నకు..ఓ మహిళ భోరుమన్నారు. దాంతో నేను షాక్‌కు గురయ్యా’ అంటూ ఆమె వెల్లడించారు. అక్కడి యువతను అధిక పనిగంటల సమస్య వేధిస్తోంది. అందుకు తగిన వేతనం పొందకుండా వారు పనిచేయాల్సి వస్తోంది. వారంలో 15 గంటలకు మించి అధిక పనిగంటలు ఉండవనే హామీతో షిజెనో ఉద్యోగంలో చేరబోతున్నారు. మిగతా సంస్థల విషయంలో ఆమెకు ఆ హామీ లభించలేదు. అధిక పని కారణంగానే యువ ఉద్యోగులు అనారోగ్యం బారిన పడటం, ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా అక్కడి మీడియాలో సహజంగా వినిపిస్తూనే ఉంటాయి. ‘నేను పని చేయడంతోపాటు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకంటూ కొంత సమయం కావాలి. నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకు, నా అభిరుచులను కొనసాగించేందుకు వెసులుబాటు ఉండాలి. అది నాకు చాలా అవసరం. అందుకు ఈ సంస్థను ఎంచుకున్నాను’ అని ఆమె చెప్పుకొచ్చారు. అధిక పని గంటల కారణంగా ప్రాణాలు కోల్పోవడాన్ని ‘కరోషి’ అని పిలుస్తారు.

ఇదిలా ఉండగా ‘ఈ ఏడాది కాలంపాటు వారంలో ఐదురోజులు రాత్రి పొద్దుపోయేదాక కార్యాలయాల్లో గతంలోలాగా ఉండకుండా, అసలు ఆఫీసులోకి అడుగు పెట్టకుండానే సిబ్బంది తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు’ అని ఆర్థికవేత్త మార్టిన్‌ ష్కుల్జ్‌ అన్నారు. కానీ ఇప్పటికీ కొన్ని సంస్థలు పాత విధానాలవైపు మొగ్గు చూపుతూ.. సిబ్బంది కార్యాలయాలకు రావాలని పట్టుబట్టే ప్రమాదం ఉందన్నారాయన. అయితే ఆ తప్పు చేయనివారితోనే విజయం ఉంటుందని చెప్పుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని