మనకు 12 టన్నుల ఆహారం.. యూఎస్‌కు 14 ఆవులు!

తాజా వార్తలు

Published : 14/06/2021 01:41 IST

మనకు 12 టన్నుల ఆహారం.. యూఎస్‌కు 14 ఆవులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రెండో దశ భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్‌ సోకిన కొంత మందిలో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతుండటంతో ఆస్ప్రతుల్లో చేర్చి ఆక్సిజన్‌ సిలిండర్ల ద్వారా ప్రాణవాయువును అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సరిపడ ఆక్సిజన్‌ నిల్వలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ భారత్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకొచ్చాయి. అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా ఇలా వివిధ దేశాలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, కొవిడ్‌ ఔషధాలను పంపించి సాయపడ్డాయి. 

అయితే, అల్ప ఆదాయ దేశమైన కెన్యా కూడా భారత్‌కు తన వంతు సాయం చేసిన విషయం తెలిసిందే. భారత్‌కు తోడుగా నిలుస్తూ 12 టన్నుల ఆహార ఉత్పత్తులను ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీకి పంపించింది. కాగా.. కెన్యా సాయంపై భారత్‌లో భిన్నస్వరాలు వినిపించాయి. కొంత మంది పేద దేశం నుంచి కూడా సాయం తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు.  కానీ, కెన్యా ప్రజలు మనస్ఫూర్తిగా చేసిన సాయాన్ని తక్కువ చేసి చూడకూడదని మరికొందరు అంటున్నారు. అయితే, మనకే కాదు.. అగ్ర రాజ్యమైన అమెరికాకు కూడా ఓ సారి కెన్యా ప్రజలు సాయం చేశారు. అమెరికాలో 2001 సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి జరగగా.. అమెరికాకు సానుభూతి తెలుపుతూ 14 ఆవుల్ని పంపించారు. అప్పుడు అమెరికా ఏ మాత్రం సంకోచించకుండా కెన్యా ప్రజల సాయాన్ని స్వీకరించింది. ఈ కథేంటో మీరే చదవండి..

మాన్‌హట్టన్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్లపై ఉగ్రదాడితో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. అల్‌ ఖైదా ఉగ్రవాదులు విమానాలతో ట్విన్‌ టవర్లను కూల్చేశారు. ఈ ఘటనలో దాదాపు 3వేల మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ దాడి నుంచి కోలుకోవడానికి అమెరికాకు చాలా కాలమే పట్టింది. అయితే, ఈ ఘటన సమయంలో కెన్యాలోని మసాయి తెగకు చెందిన విల్సన్‌ కిమెలీ నయోమ అనే యువకుడు అమెరికాలోనే చదువుకుంటున్నాడు. అదే ఏడాదిలో తిరిగి వారి గ్రామం వెళ్లిన విల్సన్‌.. అమెరికాపై ఉగ్రదాడి గురించి ఊరి పెద్దలకు వివరించాడు. ఆ సమయంలో ఆ గ్రామానికి ఎలాంటి విద్యుత్‌ సదుపాయం లేకపోవడంతో బయటి ప్రపంచంలో జరిగే సంఘటనలేవి వారికి పెద్దగా తెలిసేవి కావు. ఆలస్యంగా అమెరికా దాడి గురించి తెలిసినా.. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని, వారి కుటుంబసభ్యులను తలుచుకొని బాధపడ్డారు. అయితే, దాడితో నష్టపోయిన అమెరికాకు ఏదైనా సాయం చేయాలనుకున్నారు.

అలా 14 ఆవుల్ని అమెరికాకు ఇవ్వాలని మసాయి తెగ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కెన్యాలోని యూఎస్‌ రాయబార కార్యాలయానికి వాటిని తీసుకెళ్లి అప్పగించారు. అమెరికాను ఆదుకునేంత స్థాయి కాకపోయినా మా వంతు సాయంగా ఈ ఆవుల్ని ఇస్తున్నామని రాయబార కార్యాలయం అధికారులకు అప్పగించారు. చిన్న దేశమే అయినా.. పెద్ద మనసుతో చేస్తోన్న సాయానికి అమెరికా సంతోషం వ్యక్తం చేసింది. అయితే, ఆ ఆవుల్ని అధికారులు అమెరికాకు పంపించలేదు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలోనే వాటిని స్థానిక తెగ ప్రజలే పెంచి పోషించేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ఆవుల సంఖ్య భారీగానే పెరిగింది. అమెరికాకు కెన్యా సాయంపై విల్సన్‌.. కార్మెన్‌ అగ్రా డీడీ అనే వ్యక్తితో కలిసి ‘14 కౌవ్స్‌ ఫర్‌ అమెరికా’ పేరుతో పుస్తకం కూడా రచించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని