అధికార పార్టీ సెక్రటరీగా కిమ్‌: విషయమేంటంటే..

తాజా వార్తలు

Published : 12/01/2021 02:08 IST

అధికార పార్టీ సెక్రటరీగా కిమ్‌: విషయమేంటంటే..

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధికార వర్కర్స్‌ పార్టీ ఎనిమిదవ కాంగ్రెస్‌ సమావేశం రాజధాని ప్యాంగ్యాంగ్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన ఎన్నికల్లో.. పార్టీ జనరల్‌ సెక్రటరీగా కిమ్‌ జోంగ్‌ ఉన్ ఎన్నికయ్యారు. సమావేశాల ఆరో రోజు ఐన ఆదివారం ఈ ‘ఎన్నిక’ నిర్వహించినట్టు ఆ దేశ అధికార మీడియా సంస్థ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజన్సీ (కేసేఎన్‌ఏ) వెల్లడించింది.

దేశానికి అమూల్యమైన సేవలందించిన నేతల పట్ల గౌరవ సూచకంగా ఉత్తర కొరియా.. కిమ్‌ తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ను ‘శాశ్వత ప్రధాన కార్యదర్శి’గా, కిమ్‌ తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ను ‘శాశ్వత అధ్యక్షుడి’గానూ ప్రకటించింది. అంటే మరణానంతరం కూడా వారు ఈ పదవుల్లో కొనసాగుతున్నారన్నమాట. 2011లో తండ్రి మరణానంతరం.. కిమ్ జోంగ్‌ ఉన్ అధికార పగ్గాలు చేపట్టారు. 2012లో వర్కర్స్‌ పార్టీ ఆయనను పార్టీ అధినేత లేదా ఫస్ట్‌ సెక్రటరీగా నిర్ణయించింది. కాగా, తాజా ఎన్నికల ఫలితంగా.. జనరల్‌ సెక్రటరీ పదవి కిమ్‌ వశమైంది.

చెల్లికి మొండిచేయి

ప్రస్తుత సమావేశాల్లో అధికార వర్కర్స్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీలో వివిధ పదవులకు కూడా నేతలను ఎన్నుకున్నారు. ఐతే అంచనాలకు విరుద్ధంగా.. పార్టీ ముఖ్య నేత, కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ పేరు ఈ జాబితాలో చోటుచేసుకోకపోవటం గమనార్హం. తన అధికార పీఠాన్ని మరింత దృఢం చేసుకునేందుకే కిమ్‌ ఈ విధంగా పావులు కదిపినట్టు.. ఏకవ్యక్తి పాలన సాగే ఉత్తర కొరియా రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న పలువురు భావిస్తున్నారు.

పార్టీ ఎగ్జిక్యూటివ్‌ పోలిట్‌ బ్యూరో లేదా సెక్రటేరియట్‌ వ్యవస్థను ఉత్తర కొరియా 2016లో రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ దీనిని పునరుద్ధరించాలన్న ఆలోచనలో ఉన్న అధికార పార్టీ.. అందుకు అనుగుణంగా నిబంధనలను మార్చే విషయమై చర్చలు జరుపుతోంది. దేశ మార్గదర్శనానికి, సమైక్యతను సాధించేందుకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంగా పార్టీ ప్రతినిధులు దీనిని అభివర్ణించారు. సోమవారం కూడా ఈ సమావేశం కొనసాగనున్నట్టు ఆ దేశ మీడియా సంస్థ ప్రకటించింది. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో దౌత్య, ఆర్థిక, రక్షణ పరమైన కీలక నిర్ణయాలను గురించి చర్చలు కొనసాగుతాయని తెలిపింది.

 

 ఇవీ చదవండి..

 ట్రంప్‌కు ట్విటర్‌ షాక్‌.. ఇచ్చింది మనమ్మాయే..

ఆ ద్వీపాలు విమానాలకు శాపమా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని