సంతృప్తిగా పదవీ విరమణ చేస్తున్నా: CJI బోబ్డే

తాజా వార్తలు

Updated : 23/04/2021 19:24 IST

సంతృప్తిగా పదవీ విరమణ చేస్తున్నా: CJI బోబ్డే

దిల్లీ: ఎన్నో మధుర జ్ఞాపకాలతో పదవీ విరమణ చేస్తున్నా అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే అన్నారు. 22 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన శుక్రవారం సీజేఐగా పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా నిర్వహించిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టులో పనిచేసినందుకు సంతృప్తిగా ఉందని చెప్పారు. తదుపరి సీజేఐగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణ సమర్థంగా నాయకత్వ బాధ్యతలు నిర్వహించగలరని అన్నారు. కరోనా సమయంలోనూ కోర్టు విచారణలు ఎక్కడా ఆపలేదని జస్టిస్‌ బోబ్డే ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్చువల్‌ విధానంలో కోర్టు విచారణలు కొనసాగేలా చూశామని చెప్పారు. పరిస్థితుల దృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి వర్చువల్ కోర్టులు పనిచేశాయని తెలిపారు. బార్‌ అండ్‌ బెంచ్‌ మధ్య సమన్వయంతో ముందుకెళ్లామని చెప్పారు.

2019 నవంబరులో 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ బోబ్డే తన పదవీకాలంలో ఎన్నో కీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు. అందులో చరిత్రాత్మక అయోధ్య తీర్పు ఒకటి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఏప్రిల్‌ 24, 1956న జన్మించిన ఆయన.. నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలు పూర్తిచేశారు. 1978లో మహారాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1998లో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. మార్చి 29, 2000 తేదీ నుంచి ముంబయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 అక్టోబర్‌ 16న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్‌ 12, 2013న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. మరోవైపు నూతన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని