చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమానా

తాజా వార్తలు

Published : 30/04/2021 01:06 IST

చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమానా

(ప్రతీకాత్మక చిత్రం)

భోపాల్‌: చెట్లను నరికినందుకు గానూ మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ ఓ వ్యక్తికి రూ.1.21 కోట్ల జరిమానా విధించింది. ఆక్సిజన్‌ కొరత ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో సహజమైన ఆక్సిజన్‌ను అందించేందుకు చెట్లు ఎంత అవసరమో తెలిపేందుకు ఈ సంఘటన తార్కణంగా నిలుస్తోంది. భమోరి అటవీ పరిధిలోని సిల్వానీ గ్రామానికి చెందిన ఛోటే లాల్‌ భీలాల ఈ ఏడాది జనవరి 5న రెండు సాగ్వాన్‌ చెట్లను నరికాడు. నిందితుడు చెట్లను నరికి అక్రమంగా కలపను విక్రయిస్తున్నాడని స్థానికులు అతనిపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో భాగంగా మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ అధికారులు నిందితుడిని ఏప్రిల్‌ 26న అరెస్ట్‌ చేశారు. చెట్లు నరికినట్లు రుజువు కావడంతో అతడికి రూ.1.21 కోట్ల జరిమానా విధించారు.

నిందితుడు నరికిన రెండు చెట్ల సగటు జీవిత కాలం సుమారు 50 ఏళ్లు ఉంటాయని శాస్త్రీయ పరిశోధనల్లో తేలిందని భమోరి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మహేంద్ర సింగ్‌ తెలిపారు. ఒక సాగ్వాన్‌ చెట్టు 60 లక్షల రూపాయల విలువ చేసే ప్రయోజనాలు చేకూరుస్తుందన్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఒక సాగ్వాన్‌ చెట్టు తన జీవిత కాలంలో 12 లక్షల రూపాయాలు విలువ చేసే ఆక్సిజన్‌ అందిస్తుందట. వాయు కాలుష్య నియంత్రణకు, భూసార పరిరక్షణకు, నీటి వడపోతకు సంబంధించి 48 లక్షల రూపాయలు.. మొత్తం కలిసి 60 లక్షల రూపాయల ప్రయోజనాలు అందిస్తుందని తెలిపారు. ఆ లెక్క ప్రకారం రూ1.21 కోట్ల రూపాయల ప్రయోజనాలు అందించే రెండు సాగ్వాన్‌ చెట్లను నరికినందుకు అంత మొత్తాన్ని జరిమానా విధించినట్టు మహేంద్ర సింగ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని