లాక్‌డౌన్‌కు సిద్ధం కండి: ఉద్ధవ్‌ ఠాక్రే

తాజా వార్తలు

Updated : 28/03/2021 21:33 IST

లాక్‌డౌన్‌కు సిద్ధం కండి: ఉద్ధవ్‌ ఠాక్రే

ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం

ముంబయి: మహారాష్ట్రలో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు ఇక్కడే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నప్పటికీ పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు మహారాష్ట్ర సర్కారు మరో లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోంది. లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు సిద్ధం కావాలని ఆ మేరకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులకు సూచించారు. అందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వైరస్ విజృంభణపై ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్ల లాక్‌డౌన్‌ విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు కొవిడ్‌ మరణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైరస్‌ కట్టడి చేసేందుకు ఇప్పటికే అక్కడ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఒకవేళ లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం నాడు అధికారులతో జరిపిన సమీక్షలో చర్చించారు. ఇందులో భాగంగా.. ఆహారధాన్యాల సరఫరా, మందులు, అత్యవసర సేవలు, వైద్య సౌకర్యాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధిస్తే ప్రభుత్వం యంత్రాంగం మధ్య ఎటువంటి సమన్వయలోపం లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే దిశానిర్ధేశం చేశారు.

ముంబయిలో రికార్డు స్థాయిలో కేసులు..

మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 6,923 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. దీంతో కేవలం ఒక్క ముంబయి నగరంలోనే కొవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 45వేలు దాటింది. కొత్తగా మరో ఎనిమిది కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ముంబయి నగరంలో 11వేల మంది కొవిడ్‌ మరణాలు సంభవించాయి. ఇక దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. నిన్న ఒక్కరోజు దేశవ్యాప్తంగా 62వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, వీటిలో 35వేల కేసులు మహారాష్ట్ర నుంచే వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 61వేల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా ఒక్క మహారాష్ట్రలోనే 54వేల మంది చనిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని