కొవిడ్‌ భయంతో కిరోసిన్‌ తాగేశాడు.. మృతి తర్వాత నెగెటివ్‌!

తాజా వార్తలు

Published : 19/05/2021 01:30 IST

కొవిడ్‌ భయంతో కిరోసిన్‌ తాగేశాడు.. మృతి తర్వాత నెగెటివ్‌!

భోపాల్‌: కరోనా వైరస్‌ భయం దేశంలో ప్రతిఒక్కరినీ వెంటాడుతోంది. కానీ, అనేకమంది తమకు వైరస్‌ సోకిందనే అనవసర ఆందోళనతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి సొంత వైద్యంతో అనారోగ్యంపాలై చివరకు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఈ కొవిడ్‌ సంక్షోభంలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మహేంద్ర అనే యువకుడికి కొన్ని రోజులుగా జ్వరం ఉండటంతో కరోనా సోకిందేమోనన్న అనుమానంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కిరోసిన్‌ తాగితే కరోనా పోతుందని తన స్నేహితుడు సలహా ఇవ్వడంతో ఏమాత్రం ఆలోచించకుండా తాగేసి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తీరా, అతడి మరణం తర్వాత కొవిడ్‌ నెగెటివ్‌గా తేలడం గమనార్హం. 

వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని అశోక గార్డెన్‌ ప్రాంతంలో ఉండే మహేంద్ర అనే వ్యక్తి టైలర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల జ్వరం వచ్చి కొన్ని రోజుల పాటు తగ్గలేదు. దీంతో కరోనా సోకిందని అనుమానించి ఆందోళనకు గురయ్యాడు. కిరోసిన్‌ తాగితే కరోనా నయం అవుతుందని అతడి స్నేహితుడు సలహా ఇవ్వడంతో తాగేయడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే అతడి నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షించగా.. కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది.  ఎవరో చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని