అంగారకుడి మరిన్ని చిత్రాలు.. చూస్తారా!

తాజా వార్తలు

Published : 20/02/2021 16:37 IST

అంగారకుడి మరిన్ని చిత్రాలు.. చూస్తారా!

ఫ్లోరిడా: అరుణ గ్రహం ఉపరితలం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. అంగారకుడిపై జీవం ఆనవాళ్లను అన్వేషించేందుకు నాసా పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌ విజయవంతంగా ఆ గ్రహంపై దిగిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడి నుంచి మరిన్ని ఫొటోలను రోవర్‌ భూమికి పంపింది. ఈ ఫొటోలను నాసా విడుదల చేసింది. 

కేబుళ్ల సాయంతో అంగారకుడి ఉపరితలంపై రోవర్‌ సురక్షితంగా దిగిన ఫొటోతో పాటు మరిన్ని చిత్రాలను నాసా విడుదల చేసింది. ‘‘ఏళ్ల తరబడి కన్న కలలు నిజమైన క్షణం. లక్ష్య సాధనలో ఇదో గొప్ప అడుగు’’ అని నాసా ఈ సందర్భంగా పేర్కొంది. ఈ చిత్రాలను ప్రపంచంతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని, అసలైన విజయం సాధించినట్లు అనిపిస్తోందని నాసా ఫ్లైట్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌ అరోన్‌ స్టెహురా ఆనందం వ్యక్తం చేశారు. 

మార్స్‌ 2020 ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది జులై 30న ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి పర్సెవరెన్స్‌ను నాసా ప్రయోగించింది. విశ్వంలో ఇది 203 రోజుల పాటు 47.2 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి శుక్రవారం తెల్లవారుజామున 2.25 గంటలకు అంగారక వాతావరణంలోకి ప్రవేశించింది. అంగారకుడి మధ్యరేఖ ప్రాంతానికి ఉత్తరాన రాళ్లు, రప్పలు, ఎత్తుపల్లాలతో కూడిన సంక్లిష్ట జెజెరో బిలంలో పర్సెవరెన్స్‌ దిగింది. వచ్చే రెండేళ్ల పాటు రోవర్‌.. తవ్వకాలు చేపట్టి నమూనాలను సేకరించనుంది. భవిష్యత్‌లో ఐరోపా అంతరిక్ష సంస్థతో కలిసి నాసా చేపట్టే ల్యాండర్‌, రోవర్‌ ప్రయోగాల ద్వారా ఆ నమూనాలను శాస్త్రవేత్తలు భూమికి తీసుకురానున్నారు. 

అరుణ గ్రహంపై గతంలో జీవం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడనుంది. అరుణగ్రహంపై జీవజాలం ఉన్నట్లయితే.. దాదాపు 350 కోట్ల ఏళ్ల కిందట ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 45 కిలోమీటర్ల వెడల్పు కలిగిన జెజెరో బిల ప్రాంతంలో నాడు నది, చెరువు ఉండేవని విశ్లేషిస్తున్నారు. అక్కడ పురాతనజీవాల అవశేషాలు ఉండొచ్చని అంచనా. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని