మరో దేశాధినేతకు కరోనా: ఈయన తీరే వేరు!

తాజా వార్తలు

Published : 25/01/2021 23:52 IST

మరో దేశాధినేతకు కరోనా: ఈయన తీరే వేరు!

మెక్సికో సిటీ: అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఓబ్రడార్‌ తనకు కరోనా వైరస్‌ సోకినట్టు ప్రకటించారు. వ్యాధి లక్షణాలు చాలా పరిమితంగా ఉన్నాయని, తనకు చికిత్స కొనసాగుతోందని ఆయన వివరించారు. ‘‘నాకు కొవిడ్‌-19 వ్యాధి సోకిందని తెలిపేందుకు విచారిస్తున్నాను. ఈ వ్యాధి లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐతే నేను ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నాను. ఎప్పటి మాదిరిగానే నేను ఆశావాదిగానే ఉంటాను. మనందరం కలసి ముందుకు నడవాలి.’’ అని ఆయన తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. తమ అధ్యక్షుడు అధికార నివాసంలోనే ఉంటూ ఐసోలేషన్‌ పాటిస్తున్నట్టు ఆ దేశ వైద్యాధికారులు తెలిపారు. కాగా, మాస్కు ధరించటం తదితర కొవిడ్‌ నిబంధనలు పాటించని ఈయన వైఖరి తరచు చర్చనీయాంశమౌతోంది. 

అంతా దేవుడి దయ..

67 ఏళ్ల లోపెజ్‌ ఓబ్రడార్‌, చాలా అరుదుగా మాత్రమే మాస్కులను ధరిస్తారు. విమానాల్లో కూడా మాస్క్‌ లేకుండా ప్రయాణించటం ఆయనకు మామూలే. 17 లక్షల కేసులు, లక్షా 50 వేల మరణాలు సంభవించిన నేపథ్యంలో కూడా ఈయన తన దేశంలో లాక్‌డౌన్‌ను వ్యతిరేకించారు. జేబులోంచి మత సంబంధమైన వాక్యాలున్న రెండు తాయెత్తులను బయటకు చూపుతూ .. దేవుని దయ తమపై ఉందని, తమకేదీ కాదని ఆయన చెప్పటం గమనార్హం. కొవిడ్‌ విధానం విషయమై మెక్సికో చాలా అప్రమత్తంగా ఉండాలని, దేశ నాయకులే ప్రజలకు ఆదర్శంగా ఉండాలంటూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరోక్షంగా ఆండ్రెజ్‌ మాన్యుయెల్‌కు సూచించింది. ఐనా ఆయన సామాజిక దూరం తదితర నిబంధనలకు నీళ్లొదిలి.. ప్రజల సమీపంలోకి వెళ్లడం, వారిని హత్తుకోవటం మానలేదు.

కాగా ఆదివారం నాటికి మెక్సికోకు ఆరు లక్షలకుపైగా కొవిడ్‌ టీకా డోసులు లభించాయి. మరింత సరఫరా కోసం రష్యా అధ్యక్షుడికి విజ్ఞప్తి చేయనున్న నేపథ్యంలో ఆయనకు కరోనా సోకింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోతో సహా పలువురు లాటిన్‌ అమెరికా నేతలకు కొవిడ్‌ సోకినప్పటికీ.. వారందరూ కోలుకున్నారు.

ఇదీ చదవండి..

ఆస్ట్రేలియాలో కరోనా టీకాకు ఓకే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని