గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన మోదీ

తాజా వార్తలు

Published : 16/07/2021 17:34 IST

గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన మోదీ

గాంధీనగర్‌: దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన గుజరాత్‌లోని గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ స్టేషన్‌ నుంచి ప్రతివారం వారణాసికి వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. స్టేషన్‌ పైభాగంలో రూ.790కోట్లతో నిర్మించిన ఫైవ్‌స్టార్ హోటల్‌ను కూడా లాంఛనంగా ఆరంభించారు. తన సొంతపట్టణం వాడ్‌నగర్‌ నుంచి కలిపే గాంధీనగర్‌-వరెథా ఎంఈఎంయూ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు.

గాంధీనగర్‌ క్యాపిటల్ రైల్వేస్టేషన్‌ను రూ.71.50కోట్ల వ్యయంతో ఆధునీకరించారు. అత్యాధునిక వసతులు, హంగులతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. విశాలమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటుచేశారు. 160 కార్లు, 40 ఆటోలు, 120 ద్విచక్ర వాహనాలను పార్కు చేసేందుకు వసతి కల్పించారు. రైల్వే ప్లాట్‌ఫాం వద్ద 480 మంది నిరీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక టికెట్‌ కౌంటర్‌, ఎక్కడికక్కడ లిఫ్టులు, ఎస్కలేటర్లు పెట్టారు. వై-ఫైతోపాటు... భిన్న మతాలవారు ప్రార్థనలు చేసుకునేలా హాలు కూడా ఉంది. 120 ఏళ్ల మన్నిక ఉండేలా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల కోసం స్టేషన్‌ ప్రాంగణంలో 7,096 చదరపు మీటర్ల సువిశాల స్థలాన్ని విడిచిపెట్టారు. ఆర్ట్‌ గ్యాలరీలో ఎల్‌ఈడీ కాంతులు అబ్బురపరుస్తున్నాయి. అసోచాం ఇప్పటికే దీన్ని హరిత భవనం ‘జెమ్‌-5’గా గుర్తించింది.

మోదీ ఛాయ్‌ అమ్మిన స్టేషన్‌ను కూడా..

దీంతో పాటు ప్రధాని సొంత పట్టణమైన వాడ్‌నగర్‌లోనూ ఆధునీకరించిన రైల్వేస్టేషన్‌ను మోదీ ప్రారంభించారు. ఇక్కడే ప్రధాని తండ్రి ఒకప్పుడు ఛాయ్‌ దుకాణం నడిపారు. తన చిన్నతనంలో మోదీ కూడా తండ్రికి సాయంగా ఈ స్టేషన్‌లోనే ఛాయ్‌ అమ్మేవారు. రూ.8.5కోట్ల వ్యయంతో ఈ రైల్వేస్టేషన్‌లో ఇటీవల మార్పులు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని