
తాజా వార్తలు
చట్టాల రద్దు తప్ప.. సమస్యలేవైనా చెప్పండి
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
దిల్లీ: దేశంలో అధికభాగం రైతులు వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్నారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులతో జనవరి 19న మరో విడత చర్చలు నిర్వహించనున్నామని ఆయన ఆదివారం ఓ సమావేశంలో వెల్లడించారు. ‘కేంద్ర వ్యవసాయ చట్టాలకు చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి రైతులు నిబంధనల ప్రకారమే తదుపరి చర్చల్లో పాల్గొంటారని అనుకుంటున్నాం. చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ కాకుండా రైతులు తమ సమస్యలు ఏమిటో ప్రభుత్వానికి చెప్పాలి’ అని తోమర్ తెలిపారు.
‘మండీలు, ట్రేడర్ల రిజిస్ట్రేషన్, పంటవ్యర్థాల దహనం, కరెంటు సహా ఇతర విషయాలపై రైతుల భయాలను పరిష్కరించడానికి అంగీకారం తెలుపుతూ.. ప్రభుత్వం తరపున ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. కానీ రైతు సంఘాలు చట్టాలను వెనక్కి తీసుకోవాలనే ఒకే విషయాన్ని డిమాండ్ చేస్తున్నాయి’ అని తోమర్ తెలిపారు. కాగా మరోవైపు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ తికాయిత్ ఆదివారం నాగ్‌పూర్‌లో మాట్లాడుతూ.. దిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చట్టాల్ని రద్దు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయి అని రాకేష్ చెప్పారు.
వ్యవసాయ చట్టాలకు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 50 రోజులకు చేరుకోగా.. మరోవైపు చట్టాల అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయంలో కేంద్రం, రైతులకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు వ్యవసాయ నిపుణులతో కూడిన ఓ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి