కొవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘన: బాలీవుడ్‌ నటిపై కేసు!

తాజా వార్తలు

Updated : 15/03/2021 20:57 IST

కొవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘన: బాలీవుడ్‌ నటిపై కేసు!

బృహన్‌ ముంబయి అధికారుల వెల్లడి

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి మహారాష్ట్ర మరోసారి వణికిపోతోంది. ముఖ్యంగా ముంబయితో పాటు ఇతర ప్రధాన నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి రోజురోజుకు మరింత పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగా ఓ బాలీవుడ్‌ యాక్టర్‌ కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో ఆమె పైనా కేసు‌ నమోదు చేసినట్లు ముంబయి మునిసిపల్‌ అధికారులు వెల్లడించారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎవరైనా కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నగర భద్రతపై రాజీపడమని బృహన్‌ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్(బీఎంసీ) ప్రకటించింది.

‘నగర భద్రతపై ఎట్టిపరిస్థితుల్లో రాజీపడం. కొవిడ్‌ నిబంధనలు పాటించని కారణంగా బాలీవుడ్‌ యాక్టర్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనాను ఎదుర్కోవడంలో సహకరించండి’ అని బీఎంసీ అధికారులు ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ నటుడి వివరాలను మాత్రం బీఎంసీ అధికారులు బహిరంగపరచలేదు.

ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తోన్న అధికారులు, పలుచోట్ల లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉండడంతో నాగ్‌పూర్‌లో సోమవారం నుంచి మార్చి 21వరకు పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇక ముంబయి నగరంలో ప్రజలు అలసత్వం వహిస్తే లాక్‌డౌన్‌ విధిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే గతంలోనే హెచ్చరించారు. అయినప్పటికీ కొవిడ్‌ నిబంధనలు పాటించే విషయంలో ప్రజలు కాస్త నిర్లక్ష్యంగానే ఉంటున్నట్లు అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజు 16,620 పాజిటివ్‌ కేసులు, 50 మరణాలు రికార్డయ్యాయి. దీంతో అక్కడ క్రియాశీల కరోనా కేసుల సంఖ్య లక్షా 27వేలకు చేరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని