ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంట్‌ భవనం!

తాజా వార్తలు

Published : 22/06/2021 23:32 IST

ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంట్‌ భవనం!

దిల్లీ: దేశ ఘనచరిత్రను చాటి చెప్పేలా, ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం నిలుస్తుందని కేంద్రం పునరుద్ఘాటించింది. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపంలా,  పూర్తి పర్యావరణ అనుకూలంగా నూతన ప్రజాస్వామ్య సౌధం ఉంటుందని తెలిపింది. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనం నిర్మాణం 21 నెలల్లోనే పూర్తవుతుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రకటించారు. నూతన పార్లమెంట్‌ నిర్మాణ పురోగతి, ఇప్పటి వరకూ చేసిన పనుల వివరాలను, ఫొటోలను  ఆయన తొలిసారి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రాబోయే 150 ఏళ్ల అవసరాలను తీర్చేలా నూతన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. పాత పార్లమెంట్‌ భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదనే ఉద్దేశంతో 64,500చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్తది నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మకుటంలా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృత్తాకారంలో ఉన్న పార్లమెంట్ భవనం వందేళ్ల క్రితం నిర్మితమైందని, ఎన్నోసార్లు మరమ్మతులు, ఆధునీకరణ పనులు జరిగాయని మిశ్రా వివరించారు. పాత విధానంలో సీటింగ్‌ సామర్థ్యం పెంపుతో సహా.. ఇతర మౌలిక వసతుల విస్తరణ, టెక్నాలజీ ఆధునీకరణ సాధ్యపడలేదని అన్నారు. అందుకే కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం అనివార్యమైందని తెలిపారు. 

సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ త్రిభుజాకార డిజైన్‌ రూపొందించారని, భూకంపాలను తట్టుకునే విధంగా తీర్చిదిద్దడంతో పాటు జెడ్‌, జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ అవసరాలకు తగ్గట్టు నూతన భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. పాత పార్లమెంట్‌తో పోలిస్తే కొత్త భవనంలో సీటింగ్‌ సామర్థ్యం 150 శాతం అధికంగా ఉంటుందని, లోక్‌ సభలో 888, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులు సమావేశమైనప్పుడు ఒకేసారి 1,272 మంది కూర్చునేలా నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. 

ఉభయ సభల్లో హైక్వాలిటీ ఆడియో, వీడియో సౌకర్యం, ప్రతి డెస్క్‌లో ఎలక్ట్రానిక్‌ పరికరాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. భారతదేశ ఘన చరిత్రను చాటిచెప్పేలా రాజ్యాంగ మందిరం, పుస్తకాలయం, కమిటీ హాళ్లు, భోజన శాలలు నిర్మిస్తున్నారు. 130 కోట్ల ప్రజల ఆశలకు సరికొత్త బలాన్నిచ్చేలా భవనం ఉంటుందని దుర్గా శంకర్‌ మిశ్రా వివరించారు. దేశం నలుమూలలా ఉన్న క్షేత్ర స్థాయి కళలు, కళాకారుల నైపుణ్యాలను నూతన భవనం అడుగడుగునా ప్రతిబింబిస్తుందని అన్నారు.  ప్రస్తుతం నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల్లో 50 శాతం మందికి పైగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లలో స్లాబ్స్‌ వేసే పని మొదలైందని అన్నారు. ఇప్పటి వరకూ 16 వేల టన్నుల సిమెంట్‌, 10 వేల టన్నుల రీఎన్‌ఫోర్స్‌డ్‌ స్టీల్‌ వినియోగించినట్లు వెల్లడించారు. 2,180 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. 2022లో భారత్‌ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే సమయానికి నూతన పార్లమెంట్‌ భవనం సిద్ధమవుతుందని మిశ్రా ప్రకటించారు. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని