ఆ స్కార్పియో కేసును వదిలేయండి..!

తాజా వార్తలు

Published : 24/03/2021 13:21 IST

ఆ స్కార్పియో కేసును వదిలేయండి..!

* వికోర్లి స్టేషన్‌కు సచిన్‌వాజే ఫోన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసును దర్యాప్తు చేసే కొద్దీ సచిన్‌ వాజే క్రిమినల్‌ తెలివి బయటపడుతోంది. తాజాగా ఎన్‌ఐఏ మరిన్ని కొత్త విషయాలను వెలికి తీసింది. పేలుడు పదార్థాలతో స్కార్పియోను కనుగొన్న తర్వాత సచిన్‌ వాజే స్వయంగా వికోర్లి స్టేషన్‌కు ఫోన్‌ చేసి.. ముఖేశ్‌ హిరేన్‌ ఫిర్యాదుతో నమోదు చేసిన వాహన చోరీ కేసును దర్యాప్తు చేయవద్దని కోరారు. అంతేకాదు.. మరిన్ని వివరాలను ఎన్‌ఐఏ బయటపెట్టింది. 

ఫిబ్రవరి 27వ తేదీన..

ఈ కేసులో మన్‌సుక్‌ హిరేన్‌ ఫిబ్రవరి 18వ తేదీన తన స్కార్పియో పోయిందని వికోర్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 25న ఆ కారు అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ప్రత్యక్షమైంది. ఆ రోజు సచిన్‌ వాజే నేతృత్వంలో క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ చాలా చురుగ్గా ఈ దర్యాప్తులో పాల్గొంది. ఈ కేసు కూడా సీఐయూకే అప్పజెప్పారు.  ఫిబ్రవరి 27వ తేదీన సచిన్‌ వాజే వికోర్లి పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడు. 18వ తేదీన మన్‌సుక్‌ హిరేన్‌ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన స్కార్పియో కేసు దర్యాప్తును ఆపేయాలని కోరాడు. బాంబు బెదిరింపుల కేసు దర్యాప్తు తన చేతిలో ఉండటంతో.. ఇక 18వ తేదీన వాహన చోరీ దర్యాప్తును కూడా ఆపేస్తే తన పాత్ర బయటపడదని వాజే భావించాడు.

తప్పుడు ఆధార్‌ కార్డుతో..

తప్పుడు పేరు, ఆధార్‌ కార్డు సాయంతో ముంబయిలోని  ట్రైడెంట్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వాజే బసచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వేరేవాళ్ల ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చి ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అంతే కాదు.. ఆ హోటల్‌కు కొన్ని భారీ బ్యాగులను కూడా తీసుకొచ్చినట్లు సీసీటీవీ పుటేజీల్లో తేలింది. వాజే హోటల్లో బసచేసినప్పుడు ఎవరెవరు కలిశారనే అంశాన్ని ఎన్‌ఐఏ పరిశీలిస్తోంది. దీంతోపాటు 100 రోజులు అక్కడ ఉండేలా గదిని బుక్‌ చేసినట్లు సమాచారం. మరోపక్క సచిన్‌ వాజే వ్యాపార భాగస్వామి, కార్‌ డీలర్‌ ఆశీష్‌నాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఒక వోల్వో ఎక్స్‌సీ90 మోడల్‌ లగ్జరీ కారును స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో స్వాధీనం చేసుకొన్న రెండు బెంజికార్లలో ఒకటి ఎక్కడి నుంచి స్వాధీనం చేసుకొన్నారో ఎన్‌ఐఏ వెల్లడించలేదు.

ఆటోమొబైల్‌ కంపెనీలో తనిఖీలు..

జాతీయ దర్యాప్తు సంస్థ  బృందం థానేలోని ఓ ఆటోమొబైల్‌ కంపెనీ కార్యాలయంలో, భీవండీలోని గోదాముల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ కంపెనీల్లో రెండునెలల క్రితం వరకు వాజే డైరెక్టర్‌గా పనిచేసినట్లు ఓ ఆంగ్ల వార్తాపత్రిక కథనంలో పేర్కొంది. ఇక్కడే మన్‌సుక్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

వాజే సహచరుడికి స్థానచలనం..

ముఖేశ్‌ అంబానీకి బెందిరింపుల కేసుతో మహారాష్ట్ర సర్కారు.. ముంబయి క్రైం బ్రాంచ్‌లో ప్రక్షాళన చేపట్టింది. సచిన్‌ వాజే ఇంటి నుంచి సీసీటీవీ డీవీఆర్‌ను తీసుకొచ్చిన అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌ ఖాజీని నేడు బదిలీ చేశారు. వాజే మరో సహచరుడు ప్రకాశ్‌ హవాల్దాను వేరోచోటుకు పంపించారు. వీరికి ఒకరిని పోలీస్‌ ఆయుధ విభాగం, మరొకరిని మలాబార్‌హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు.  ఈ బదిలీల జాబితాలో మొత్తం 86 మంది ఉన్నట్లు ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. వీరిలో క్రైమ్‌ బ్రాంచికి చెందినవారే 65 మంది ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని