
తాజా వార్తలు
హత్యకేసు: సహనం కోల్పోయిన బిహార్ సీఎం
పట్నా: ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగి హత్య కేసు విషయంలో ప్రశ్నలు అడిగిన విలేకరులపై బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధినేత నీతీశ్ కుమార్ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నీతీశ్‌పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడ్రోజుల క్రితం ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగి రూపేశ్ సింగ్ పట్నాలోని అతడి ఇంటి వద్ద హత్యకు గురయ్యాడు. అతడు కారు వద్ద ఉండగా.. ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఈ ఘటన సీఎం నీతీశ్ ఇంటికి సమీపంలోనే చోటుచేసుకుంది. రూపేశ్ సింగ్‌కు అనేక మంది రాజకీయనాయకులతో, ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయి. దీంతో అతడి హత్యపై దుమారం రేగింది. గూండాలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, ప్రభుత్వం నేరస్థులను రక్షిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నీతీశ్‌కు ఈ హత్య కేసు తలనొప్పిగా మారింది.
ఇండిగో ఉద్యోగి హత్య నేపథ్యంలోనే తాజాగా విలేకర్లు రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి స్పందించాలని సీఎం నీతీశ్‌ను అడిగారు. సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి.. మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారు? అని విలేకర్లను ఎదురు ప్రశ్నించారు. ‘మీరు అడిగే ప్రశ్నలు సరైనవి కావు. పోలీసులను కించపర్చే విధంగా వ్యవహరించకండి. పోలీసులు వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. 2005కు ముందు చాలా నేరాలు, హింసాత్మక ఘటనలు జరిగాయి. వాటి గురించి ఎందుకు ప్రస్తావించరు?నేను నేరుగా అడుగుతున్నాను.. మీరు ఎవరికి మద్దతిస్తున్నారు?’’అని విలేకర్లను నీతీశ్ తిరిగి ప్రశ్నించారు. హత్యకు సంబంధించి ఆధారాలు మీకు లభిస్తే పోలీసులకు చెప్పండి.. కేసును పరిష్కరించడంలో సాయం చేయండని విలేకర్లను కోరారు.
సీఎం చేతులెత్తేశారు: తేజస్వీ యాదవ్
విలేకర్ల పట్ల బిహార్ సీఎం వ్యవహరించిన తీరుపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘‘నేరం ఎవరు చేశారు? ఎందుకు చేశారని విలేకర్లనే అడుగున్నారు? ఇది దురదృష్టకరమైన వార్త. సీఎం నీతీశ్ కుమార్ చేతులెత్తేసి నేరస్థుల ముందు లొంగిపోయారు’’అని ట్వీట్ చేశారు.