
తాజా వార్తలు
మా సహనాన్ని పరీక్షించొద్దు!
చైనాకు పరోక్ష హెచ్చరిక
ఆర్మీ డే సందర్భంగా భారత సైన్యాధిపతి
దిల్లీ: గాల్వన్ ఘటనలో అమరులైన 20మంది భారత సైనికుల త్యాగాలు ఎన్నటికీ వృథా కావని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె స్పష్టంచేశారు. శత్రువులు తమ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదని.. భారత సైన్యం సహనాన్ని పరీక్షించడానికి ఎవ్వరూ ప్రయత్నించొద్దని హెచ్చరించారు. సరిహద్దుల్లో యథాతథస్థితిని మార్చేందుకు చైనా యత్నించిందని..ఈ సమయంలో చైనాకు భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చిందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఉద్దేశిస్తూ నరవణే ఈవిధంగా మాట్లాడారు.
గత సంవత్సరం (2020) భారత సైన్యానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు ఎనిమిది రౌండ్లలో జరిగిన చర్చల వల్ల సైనికుల్లో భద్రతను కల్పించామన్నారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం దాదాపు 40శాతం పెరిగిందన్నారు. అయితే, గతేడాది నియంత్రణరేఖ వద్ద 200లకు పైగా ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. ఇక సైన్యంలో ఆయుధ సంపత్తి బలోపేతం కోసం రూ.5వేల కోట్ల విలువైన ఆయుధాల కోసం ఒప్పందం చేసుకున్నట్లు సైన్యాధిపతి నరవణె వెల్లడించారు.
ఆర్మీ డే సందర్భంగా దిల్లీ కరియప్ప మైదానంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్..జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత సైన్యం తొలిసారిగా సమూహ డ్రోన్ల ప్రదర్శన చేసింది. పరేడ్‌లో పలు యుద్ధ ట్యాంకులు, అత్యాధునిక పరికరాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇక గత ఏడాది గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20మంది భారత్ సైనికులు అమరులయ్యారు. అయితే, ఆ ఘటనలో ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారనే వివరాలను చైనా ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దాదాపు ఏడు నెలల కింద జరిగిన ఈ ఘటనతో అక్కడ ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఇరు దేశాలు భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి. ఇదిలాఉంటే, 1949లో తొలి భారతీయ జనరల్..బ్రిటిష్ అధికారి నుంచి భారత సైన్యం బాధ్యతలు తీసుకున్న గుర్తుగా ఏటా జనవరి 15న సైనిక దినోత్సవం జరుపుకొంటున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది
భారత భూభాగంలోకి చైనా జవాన్